జాతీయ విద్యా విధానం(NEP)-2020 ప్రకారం ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్(ABC) ప్రోగ్రామ్‌లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో మల్టిపుల్ ఎంట్రీ(Multiple Entry)- ఎగ్జిట్(Exit) సౌలభ్యాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. మూడేళ్ల డిగ్రీ కోసం కాలేజీలో చేరి సంవత్సరం తరువాత ఒక సర్టిఫికేట్(Certificate) పొంది బయటకు వెళ్లిపోవచ్చు. అనంతరం కొన్నేళ్ల తరువాత మిగతా రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సును పూర్తి చేయడానికి మళ్లీ కాలేజీకి రావచ్చు. ఇది వినడానికి వింతగా ఉన్నా.. త్వరలోనే ఈ విధానం కార్యరూపం దాల్చనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ విధానాన్ని అత్యవసర ప్రాతిపదికన అమలు చేయాలని దేశంలోని కళాశాలలు, యూనివర్సిటీలు(Universities), ఇతర ఉన్నత విద్యా సంస్థలను కోరింది.
అకడమిక్ బ్యాంక్ క్రిడెట్(ABC) ప్రోగ్రామ్ పరిధిని యూజీసీ మరింత విస్తరించడం కోసం ఉన్నత విద్యా సంస్థలు ABC వెబ్ సైట్ (www.abc.gov.in)లో నమోదు చేసుకోవాలని సూచించింది. 2021-22 విద్యా సంవత్సరంలో లేదా ఆ తర్వాత పొందిన క్రెడిట్లతో సహా విద్యార్థుల డేటాను అప్లోడ్ చేయాలని కోరింది. అలాగే విద్యా సంస్థల వెబ్సైట్ హోమ్ పేజీలో ABC హైపర్‌లింక్‌ను ఏర్పాటు చేసుకోవాలని కూడా కమిషన్ కోరింది.
అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్... విద్యార్థులు సంపాధించిన క్రెడిట్స్‌ను డిజిటల్‌గా స్టోర్ చేస్తుంది. క్రెడిట్లను ఆధారంగా చేసుకోని విద్యార్థులకు డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లను అందించనుంది. ABC అనేది విద్యార్థులకు సంబంధించిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్స్‌ను తెరవడం, మూసివేయడం, ధ్రువీకరించడం, బదిలీ చేయడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. మల్టిపుల్ ఎంట్రీ-ఎగ్జిట్ సూత్రంపై పని చేయడంతో పాటు ఏ సమయంలోనైనా డిగ్రీ లేదా డిప్లొమా సర్టిఫికేట్లను పొందేందుకు, అలాగే విద్యార్థులు తమ సొంత అభ్యాస మార్గాన్ని ఎంచుకోవడానికి కూడా ఇది(ABC) సులభతరం చేస్తుందని యూజీసీ పేర్కొంది.
ABC ప్రోగ్రామ్ నిబంధనలు బ్లెండెడ్ లెర్నింగ్ మోడ్‌ను ప్రోత్సహిస్తుంది. SWAYAM ద్వారా ఈ ప్రోగామ్లో రిజిస్టర్ అయిన వివిధ ఉన్నత విద్యా సంస్థల నుంచి క్రెడిట్లను సంపాదించడానికి విద్యార్థులకు అనుమతించనున్నారు. దీంతో విద్యార్థి తమ కళాశాల లేదా యూనివర్సిటీ కాకుండా బయటి సంస్థల నుంచి 50 శాతం వరకు క్రెడిట్లను పొందవచ్చు. విద్యార్థులు సర్టిఫికేట్/డిగ్రీని అందుకున్న తర్వాత, అప్పటి వరకు వారు సంపాదించిన అన్ని క్రెడిట్లు సంబంధిత ఖాతా నుండి తొలగించనున్నారు. కాగా, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ABC) ప్లాట్‌ఫారమ్‌ను డిజిలాకర్ ఫ్రేమ్‌వర్క్ కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇ-గవర్నెన్స్ విభాగం (NeGD) అభివృద్ధి చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Certificate, Degree students, Student, UGC