కొవిడ్ తర్వాత ఎల్కేజీ చదివే పిల్లల దగ్గర నుంచి పీజీలు చేసే కుర్రాళ్ల దాకా అందరికీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (Online Education) పరిచయమైంది. ఆన్‌లైన్‌లో వివిధ రకాల కోర్సులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. డిజిటల్ లెర్నింగ్‌పై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ ఉడెమీ (Udemy) అనే డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారం గురించి తెలిసే ఉంటుంది. అమెరికా (America) కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్థ 2010లో ప్రారంభమైంది. ఎరెన్ బాలి, గగన్ బియానీ, ఓక్టే కాగ్లార్ దీన్ని స్థాపించారు. తొలుత ఉచిత ఆన్‌లైన్ విద్యగా ప్రారంభమైనా ఆదరణ పెరగడంతో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఉడెమీ హిందీ, తమిళం, తెలుగు వంటి ప్రాంతీయ భాషలతో సహా సుమారు 75 భాషల్లో దాదాపు 200,000 కంటే ఎక్కువ కోర్సులను అందిస్తోంది. తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడంలో భాగంగా ఉడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్ (IC) లో హిందీలో కొన్ని కోర్సులను అందిస్తోంది.
* ఉడెమీ ఇంటర్నేషనల్ కలెక్షన్ (IC)
ఉడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్లో భాగంగా సొంత భాషలో కోర్సు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో రష్యన్, స్పానిష్, అరబిక్, ఫ్రెంచ్, పోర్చుగీస్, జర్మన్, ఇటాలియన్, ఇండోనేషియా, జపనీస్, మాండరిన్, కొరియన్ తదితర భాషల్లో వివిధ రకాల కోర్సులను అందిస్తుంది. 14 భాషల్లో 12,000కు పైగా కోర్సులను అందిస్తోంది. హిందీలో వందకు పైగా కోర్సులను అందిస్తోంది. మార్కెట్ పెంచుకోడానికి లాంగ్వేజ్ పరంగా ఆ కోర్సులకు ఉండే డిమాండ్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఆయా భాషల్లో కోర్సులను పెంచుతున్నారు.
* హిందీలో ఉన్న కోర్సులు
ఉడెమీ బిజినెస్ ఇంటర్నేషనల్ కలెక్షన్లో లీడర్‌షిప్ & మేనేజ్‌మెంట్, డేటా సైన్స్, సేల్స్, ఐటీ ఆపరేషన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫైనాన్స్ & అకౌంటింగ్, మార్కెటింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. వీటితో పాటు పైథాన్ ప్రోగ్రామింగ్, ఎస్ఈవో (SEO) ఆధారిత కంటెంట్ రైటింగ్ నేర్చుకోవచ్చు.
* నైపుణ్యాలకు భాష అడ్డుకాకూడదు
దీనికి సంబంధించి ఉడెమీ ఇండియా, దక్షిణాసియా బిజినెస్ కంట్రీ హెడ్ వినయ్ ప్రధాన్ మాట్లాడుతూ రోజుకో రకంగా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ అవసరాలు మారుతున్నాయి. వాటికి అనుగుణంగా యువత నైపుణ్యాలు పెంచుకోవాలని అంటున్నారు. అలా నేర్చుకునే క్రమంలో వారికి భాష అడ్డు కాకూడదనే భావనతోనే ప్రాంతీయ భాషల్లో కోర్సులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి : విద్యార్థులకు ఫిబ్రవరి నెల కీలకం.. ఈ నెలలో ముఖ్యమైన ఈవెంట్స్ ఇవే..
ఆసియా పసిఫిక్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆయా స్థానిక భాషల్లో నిపుణులతోనే కోర్సులు అందిస్తున్నామన్నారు. గతంలో అలెక్సా వెబ్‌సైట్ ఇచ్చిన ప్రపంచ ర్యాంకింగుల్లో ఉడెమీ 110వ స్థానంలో, ఇండియాలో 35వ స్థానంలో ఉంది. ఇందులో కోర్సు చేసిన వారికి సర్టిఫికేట్ ఇస్తారు. మీకు అనుకూలమైన సమయంలో నేర్చుకునే వెసులుబాటు కూడా ఉంది. మరిన్ని వివరాలు అవసరమైన వారు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో చూడచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Hindi, JOBS