TSPSC Paper Leak Case: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ లో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట ఏఈ పేపర్ మాత్రమే లీక్ అయినట్లు గుర్తించిన పోలీసులకు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో గ్రూప్ 1 ప్రిలిమ్స్ తో సహా పలు పరీక్షలను ఈరోజు TSPSC రద్దు చేసింది. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను TSPSCకి సిట్ అందించింది. ఈ నివేదికలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రవీణ్ అనుకుంటున్న తరుణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో రాజశేఖర్ ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అంతేకాదు అతను ఉద్దేశ్యపూర్వకంగానే TSPSCలోకి వచ్చినట్లు తెలుస్తుంది. టెక్నీకల్ ఆఫీసర్ గా ఉన్న రాజశేఖర్ డిప్యుటేషన్ పై TSPSCకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా వచ్చాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తో సంబంధాలు కొనసాగించాడు. ఆ తరువాత కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ ను దొంగిలించినట్లు గుర్తించారు. శంకర్ లక్ష్మీ తాను పాస్ వర్డ్ ఎక్కడ రాయలేదని..చెప్పలేదని చెప్పడంతో రాజశేఖర్ హ్యాక్ చేసి పాస్ వర్డ్ దొంగిలించినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఆ తరువాత ఓ పెన్ డ్రైవ్ లో 5 పరీక్ష పత్రాలను రాజశేఖర్ కాపీ చేసుకున్నాడు. అనంతరం ఆ పెన్ డ్రైవ్ ను ప్రవీణ్ కు ఇచ్చాడు.
ఈ క్రమంలో ప్రవీణ్ ఏఈ హెగ్జామ్ పేపర్ ను రేణుకకు లీక్ చేశాడు. ఫిబ్రవరి 27నే రాజశేఖర్ పేపర్ ను కాపీ చేసినట్లు గుర్తించారు. అంతేకాదు గ్రూప్ 1 పేపర్ కూడా లీక్ అయినట్లు సిట్ గుర్తించింది. అలాగే ప్రవీణ్ కు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 103 మార్కులు రావడంపై కూడా అధికారులు కూపీ లాగారు. సెక్రెటరీ దగ్గర పీఏగా ఉంటూ గ్రూప్ 1 పేపర్ కొట్టేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రవీణ్ గ్రూప్ 1 లో క్వాలిఫై కాకపోవడం గమనార్హం.
ఇక ఈ కేసులో 9 మంది నిందితులను 6 రోజుల పాటు సిట్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుండి ఈనెల 23 వరకు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC