తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల (Telangana Police Jobs) తర్వాత అత్యంత ఎక్కువ మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూసింది గ్రూప్-4 నోటిఫికేషన్ (TSPSC Group-4 Notification) కోసమే. 9 వేలకు పైగా ఖాళీలు ఉండడమే ఇందుకు కారణం. టీఎస్పీఎస్సీ కొన్ని నెలలుగా ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రేపో, మాపో ఉంటూ ఊరిస్తూ వచ్చింది. ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు సైతం అనేక వేదికలపై ఈ నోటిఫికేషన్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు. అయితే.. ఎట్టకేలకు డిసెంబర్ 1న ఈ ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ నోట్ ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) విడుదల చేసింది. 9168 గ్రూప్-4 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను డిసెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే.. డిసెంబర్ 23న దరఖాస్తులను ప్రారంభించలేదు టీఎస్పీఎస్సీ. ఆ సమయంలో దరఖాస్తుల ప్రారంభాన్ని డిసెంబర్ 30కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు నిన్న ఉదయం నుంచే దరఖాస్తు చేసుకోవడం కోసం వెబ్ సైట్ ఓపెన్ చేయగా అప్లికేషన్ లింక్ కనిపించలేదు. నిన్న అర్థరాత్రి వరకు కూడా ఇదే పరిస్థతి ఉండడంతో నిరుద్యోగుల్లో ఆందోళన కనిపించింది. మరో సారి దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడుతుందేమోనని అంతా భావించారు. కానీ ఎట్టకేలకు రాత్రి 11.50 నిమిషాల సమయంలో అప్లికేషన్ లింక్ ను కమిషన్ వెబ్ సైట్లో యాక్టివేట్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న అభ్యర్థులకు షాక్ ఇచ్చింది టీఎస్పీఎస్సీ. డిటైల్డ్ నోటిఫికేషన్లో పోస్టులను తగ్గించింది.
TSPSC Group-3 Notification: తెలంగాణ గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలివే!
మొదట 9168 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెబ్ నోట్లో ప్రకటించగా.. డిటైల్డ్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 8039గా మాత్రమే ఉంది. దీంతో మొత్తం 1129 ఖాళీలు తగ్గాయి. అయితే.. పంచాయితీ రాజ్ విభాగంలో 1129 పోస్టులు తగ్గినట్లు సమాచారం. పంచాయతీ రాజ్ శాఖ నుంచి కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే ప్రతిపాదనలు అందడం.. మిగతా వాటి విషయంలో ఆ శాఖ నుంచి స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ఆ పోస్టులకు ఆమోదం రాకపోవడంతోనే డిటైల్డ్ నోటిఫికేషన్లో ఆ వివరాలను పేర్కొనలేదని టీఎస్పీఎస్సీ వర్గాల నుంచి సమాచారం. అయితే.. అనుమతులు వచ్చిన తర్వాత ఆ పోస్టులను కూడా కలుపుతూ మరో సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేస్తారా? లేదా ఆ ఖాళీల భర్తీకి మరో ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా పోస్టుల సంఖ్య తగ్గడంతో నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 4, Job notification, JOBS, Telangana government jobs, TSPSC