TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా రమేష్, సురేష్ తో పాటు ప్రశాంత్ రెడ్డి, రాజేందర్ కుమార్ లను అరెస్ట్ చేశారు. పేపర్ లీక్ చేసిన వారి నుంచి ప్రశాంత్ పేపర్ కొనుగోలు చేసి గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ కేసులో తాజాగా మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గండీడ్ కు చెందిన తిరుపతయ్యను సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతయ్య రేణుక భర్త డాక్వా నాయక్ నుండి పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 15కు చేరింది.
ఇక ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్వా నాయక్, రాజేశ్వర్ లను అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఇప్పటికే సీసీఎస్ నుంచి నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సిట్ కార్యాలయానికి తరలించారు. మొదటిరోజు వీరిని 8 గంటల పాటు పోలీసులు విచారించి కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈరోజు కూడా కీలక అంశాలకు సంబంధించి ప్రశ్నించనున్నారు. వారు చెప్పే సమాధానాలను బట్టి మరిన్ని అరెస్టులు వుండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటివరకు కమీషన్ లో పని చేసే ప్రవీణ్ ఒక్కడే గ్రూప్ 1 పరీక్ష రాశాడని తేలగా తాజాగా మరో 10 మంది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయినట్లు తెలుస్తుంది. ఇందులో ఏడుగురు రెగ్యులర్ ఉద్యోగులు కాగా మరో ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా తెలుస్తుంది. అయితే వీరు కమీషన్ లో పని చేస్తూనే పరీక్ష రాశారా? లేక సెలవులో ఉండి పరీక్ష రాశారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే పరిక్ష రాయడానికి వీరు కమిషన్ నుండి అనుమతి తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే వీరికి కూడా ప్రశ్నాపత్రం లీక్ అయిందా అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజశేఖర్, ప్రవీణ్, రేణుకకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు.
రానున్న రోజుల్లో పేపర్ లీక్ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana, Telangana government jobs, TSPSC, TSPSC Paper Leak