గ్రూప్ 4 ఉద్యోగాలు(Group 4 Jobs).. ప్రస్తుతం తెలంగాణలో(Telangana) ఏ నిరుద్యోగిని కదిలించినా ఈ ఉద్యోగాల గురించే మాట్లాడుతున్నారు. ఎందుకంటే.. ఇంత భారీ మొత్తంలో గ్రూప్ 4 ఉద్యోగాలను ఎప్పుడూ భర్తీ చేయలేదు. ప్రణాళిక ప్రకారం చదివితే.. ఈ ఉద్యోగం(Job) సాధించడం అంత పెద్ద కష్టమేమి కాదంటూ కోచింగ్ సెంటర్(Coaching) నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించగా.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పోలీస్, గ్రూప్ 1, గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశారు.
అంతే కాకుండా.. 64వేలకు పైగా ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు లభించాయి. అయితే గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వెబ్ సైట్లో డిసెంబర్ 23వ తేదీన అందుబాటులో ఉండనుంది. అర్హత, జిల్లాల వారీగా పోస్టులు, ఫీజు వంటి ఇతర వివరాలను అన్నీ.. ఆ రోజే తెలియనున్నాయి. అయితే అర్హత విషయంలో చాలా మంది నిరుద్యోగులు కాస్త గందరగోళానికి గురవుతున్నారు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో ఏ అర్హతతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారనే ప్రశ్నలను నిరుద్యోగులు లేవనెత్తుతున్నారు.
అయితే తెలంగాణ ఏర్పడక ముందు 2012లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడింది. దీనిలో గ్రూప్ 4 ఉద్యోగాలను ఇంటర్మీడియట్ అర్హతతో భర్తీ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2018 లో మరో గ్రూప్ 4 నోటిఫికేషన్ వెలువడింది. దీనిలో డిగ్రీ అర్హతతో గ్రూప్ 4 ఉద్యోగాలకు భర్తీ చేశారు. అయితే తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ లో కూడా డిగ్రీ అర్హతతోనే దరఖాస్తులను ఆహ్వానిస్తారని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక జిల్లాల వారీగా పోస్టులు ఎలా ఉండబోతున్నాయి.. ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయి అనే విషయాలపై క్లారిటీ లేదు. కానీ.. 33 జిల్లాల్లో చిన్న జిల్లాకు 150 నుంచి 200 మధ్య పోస్టులు ఉండే అవకాశం ఉంది. జనాభా, రెవెన్యూ మండలాల పరంగా అత్యధికంగా ఉన్న జిల్లాల్లో 200 నుంచి 350 మధ్య పోస్టులు ఉండనున్నాయి. అయితే ఈ గ్రూప్ 4 ఉద్యోగాలు మొత్తం 25 డిపార్ట్ మెంట్స్ వారీగా ఖాళీలు ఉన్నాయి.
వీటిలో కూడా.. ఒక్కో డిపార్ట్ మెంట్ నుంచి రోస్టర్ ప్రకారం ఖాళీలను గుర్తించి.. వాటిని మొత్తం నోటిఫికేషన్ లో వెల్లడిస్తారు.
అయితే ఒక్కో జిల్లాకు సగటున మినిమం 200 పోస్టులు ఉండనున్నాయి. ఈ జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య అనేవి అంచనా మాత్రమే.. అధికారికంగా డిసెంబర్ 23న వెలువడే నోటిఫికేషన్లో తెలియనుంది. ఇక పరీక్ష విషయానికి వస్తే.. రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీ. అయితే ఈ నోటిఫికేషన్లో 25 డిపార్ట్ మెంట్స్ ఉన్నాయి కాబట్టి.. అన్ని పోస్టులకు ఒకే పరీక్ష విధానం ఉండకపోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.