తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లో పేపర్ లీకేజీ వ్యవహారం అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ పేపర్లు లీకయ్యాయి? ఆయా పరీక్షలు రద్దు అవుతాయా? ప్రస్తుతం ప్రకటించిన వివిధ పరీక్షల తేదీలు మారుతాయా? అన్న ఆందోళనతో నిరుద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నెల 5వ తేదీన నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ (TSPSC AE Exam Paper leak) అయినట్లు పోలీస్ విచారణలో స్పష్టమైన విషయం తెలిసిందే. దీంతో ఈ పరీక్ష రద్దు ఖాయమన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం టీఎస్పీఎస్సీ బోర్డు (TSPSC Board Meeting) సమావేశమైంది. అయితే.. పోలీసుల దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత ఈ రోజు నిర్ణయం తీసుకోవాలని భావించి సమావేశాన్ని వాయిదా వేశారు. దీంతో ఈ రోజు సాయంత్రంలోగా నిర్ణయాన్ని ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది.
లీకేజీ వ్యవహారం ఒకరిద్దరికే పరితమైందా? లేక ఇంకా అనేక మందికి పేపర్ చేరిందా? అన్న అంశాలను పరిగణలోకి తీసుకుని పరీక్ష రద్దుపై నిర్ణయం తీసుకోనుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏ నిర్ణయం తీసుకుంటే.. ఎలాంటి పరిణామాలు వస్తాయి? అన్న కోణంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా ఆలోచనలు చేస్తోంది. ఇందుకోసం న్యాయ నిపుణల సలహాలను సైతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకోనుంది.
TSPSC : పేపర్ లీకేజీపై రేగుతున్న దుమారం.. గ్రూప్ 1 రద్దవుతుందా?
వివిధ ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 837 అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 55 వేల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. దీంతో ఈ 55 వేల మంది అభ్యర్థులు కమిషన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS, TSPSC, TSPSC Paper Leak