టీఎస్పీఎస్సీ(TSPSC) తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. పేపర్ లీకేజీ కారణంగా గతంలో రద్దు చేసిన ఏఈఈ (AEE) పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 8న ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్సానిక్స్ ఇంజనీరింగ్, 9న అగ్రికల్చర్ ఇంజనీరింగ్, 21న సివిల్ ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. జనవరి 22న ఏఈఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. అయితే.. పేపర్ లీకేజీ అయినట్లు నిర్ధారణ కావడంతో ఈ పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తాజాగా ఈ పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఇదిలా ఉంటే.. TSPSC పేపర్ లీక్ వ్యవహారం కేసులో దర్యాప్తు జరుగుతున్నా కొద్దీ ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అనేక మలుపు తీసుకున్న ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశ్నపత్రాల లీక్ విషయం టిఎస్పిఎస్సి కమీషన్ కార్యాలయంలో పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులకు ముందే తెలుసని అధికారులు నిర్ధారించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ షమీమ్, ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రమేష్ లు పేపర్ లీకైన విషయాన్ని ముందుగానే గుర్తించినట్లు సిట్ విచారణలో తేలింది.
ఈ విషయం తెలుసుకున్న ప్రవీణ్, రాజశేఖర్ ప్రశ్నపత్రాల లీకేజి అంశం ఉన్నతాధికారులకు చెబుతారేమో అని భయపడ్డారు. ఈ క్రమంలో షమీమ్, రమేష్ ను ప్రలోభపెట్టారు. మీకు కూడా గ్రూప్ 1 పేపర్ ఇస్తామని.. మీరు కూడా పరీక్ష రాసి ఉద్యోగం సాధించుకోవచ్చని ప్రవీణ్, రాజశేఖర్ చెప్పుకొచ్చారు. దీంతో ఆ విషయం ఎవరికీ చెప్పకుండా గ్రూప్ 1 పేపర్ తీసుకున్నారు. కాగా షమీమ్, రమేష్ ల నుంచే న్యూజిలాండ్ లో ఉన్న ప్రశాంత్ కు, సైదాబాద్ కు చెందిన సురేష్ కు పేపర్ లీక్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురిని ఇప్పటికే కోర్టు 5 రోజుల సిట్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. వీరి విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయన్నది ఆసక్తిగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS, Telangana government jobs