తెలంగాణలో మార్చి 24న టెట్ నోటిఫికేషన్ ను (TS TET-2022 Notification) విద్యాశాఖ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ఎగ్జామ్ (TS TET Exam) ను జూన్ 12వ తేదీన నిర్వహించారు అధికారులు. ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1 ఎగ్జామ్ జరగగా.. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 ను నిర్వహించారు. అయితే.. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో సైతం పేర్కొన్నారు. దీంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా రేపు ఫలితాలు (TS TET Results) విడుదల అవుతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ.. రేపు ఫలితాలు విడుదల కావడం అనుమానమేనని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఫైనల్ కీ (TS TET Final Key) విడుదల కాకపోవడమే. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదల చేసిన అధికారులు.. దీనిపై అభ్యంతరాలను జూన్ 18వ తేదీ వరకు స్వీకరించారు. పేపర్-1కు సంబంధించి మొత్తం 7,930 అభ్యంతరాలు రాగా.. పేపర్ 2కు సంబంధించి మొత్తం 4,663 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే.. ఈ అభ్యంతరాలన్నింటినీ పరిశీలించి ఫైనల్ కీని విడుదల చేయాల్సి ఉంది. అయితే ఫైనల్ కీ ఈ నెల 24న విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగినా.. ఇప్పటి వరకు కూడా ఫైనల్ కీని విడుదల చేయలేదు అధికారులు. సాధారణంగా ఫైనల్ కీ విడుదల, ఫలితాల ప్రకటనకు మధ్య కనీసం ఒకటి లేదా రెండు రోజుల సమయం అయినా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఫైనల్ కీ విడుదల కాకపోవడంతో రేపు ఫలితాల వెల్లడి ఉండదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఫలితాలతో పాటే తుది కీని కూడా విడుదల చేస్తారనే మరో ప్రచారం కూడా ఉండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Inter results |Telangana : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై క్లారిటీ .. 28న వెల్లడిస్తామని బోర్డ్ ప్రకటన
పరీక్ష జరిగి దాదాపు 14 రోజులు గడుస్తున్నా.. ఇంకా ఫైనల్ కీని విడుదల చేయకపోవడంపై విద్యాశాఖ అధికారులపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రశ్నలు సిలబస్ బయటి నుంచి రావడంతో నష్టపోయామని.. ప్రాథమిక కీలో తాము లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించకుండా నేరుగా ఫలితాలను విడుదల చేస్తే నష్టపోతామని మరికొందరు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే.. టెట్ ఫలితాలు, ఫైనల్ కీ విడుదలపై రేపు మధ్యాహ్నంలోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JOBS, Results, TS TET 2022