ఎట్టకేలకు తెలంగాణలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను (TS Inter First Tear Results) అధికారులు ఈ రోజు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ (Pass Percentage) నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇంటర్ జనరల్ విభాగంలో మొత్తం 4,09,991 మంది పరీక్షలకు హాజరవ్వగా కేవలం 1,99,756 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 49, 331 మంది పరీక్షకు హాజరవ్వగా కేవలం 24,226 మంది మాత్రమే పాస్ అయ్యారు. జనరల్ లో 49 శాతం, ఒకేషనల్ లో కూడా 49 శాతం మాత్రమే పాస్ అయ్యారు. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 4,59,242 మంది పరీక్షకు (Exams) హాజరవ్వగా 2,24,012 మంది మాత్రమే పాస్ అయ్యారు. మొత్తం పాసైన వారి శాతం 49 శాతం మాత్రమే నమోదైంది. మొత్తం బాలికలు 2,26,616 మంది పరీక్షలకు హాజరవ్వగా 1, 26,289 మంది పాస్ అయ్యారు. ఉత్తీర్ణత శాతం 56 శాతంగా నమోదైంది.
బాలుర విషయానికి వస్తే 2,36,626 మంది పరీక్షకు హాజరు కాగా కేవలం 97,723 మంది మాత్రమే పాస్ అయ్యారు. బాలుర పాస్ శాతం కేవలం 42 శాతంగా నమోదైంది. దీంతో ఉత్తీర్ణత శాతంలో మరో సారి బాలికలే పై చేయి సాధించారు. అయితే.. 2020లో 60 శాతం, అంతకు ముందు 2019లో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే కరోనా నేపథ్యంలో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 49 శాతానికి పడిపోయింది.
TS Inter First Year Results: తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ ఇలా చెక్ చేసుకోండి
అయితే గత మార్చిలో కరోనా ఉధృతి కారణంగా ప్రభుత్వం పరీక్షలు లేకుండానే ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండియర్ లోకి ప్రమోట్ చేసింది. అయితే.. ప్రస్తుతం కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో మళ్లీ ఆయా విద్యార్థులకు ఎగ్జామ్స్ నిర్వహించింది. అయితే ఆ సమయంలో ఇంటర్ బోర్డ్ పై తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు సరిగా చదువలేకపోయారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ క్లాసులు సరిగా అర్థం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
TS Inter Results 2021: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... మార్క్స్ మెమో ఇలా డౌన్లోడ్ చేయండి
ఈ అంశంపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారు. అయితే.. కోర్టు కూడా పరీక్షల నిర్వహణకే ఓకే చెప్పింది. దీంతో పరీక్షలను నిర్వహించారు అధికారులు. అయితే.. విద్యార్థులు ఒక వేళ ఫెయిల్ అయినా కూడా వారికి కనీస మార్కులను కేటాయించి పాస్ చేయాలని తల్లిదండ్రులు ఆ సమయంలో డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు భయపడినట్లు గానే పాస్ శాతం అత్యంత తక్కువగా కేవలం 49 శాతం మాత్రమే నమోదైంది. దీంతో ఫెయిల్ అయిన విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ అంశంపై ఇంటర్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Intermediate exams, Telangana inter board, Telangana Inter Results