ఈ ఏడాది జేఈఈ పరీక్షల షెడ్యూల్ మార్చడం కారణంగా తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ని కూడా సవరించాల్సి వచ్చింది. మొత్తానికి మే 6 నుంచి తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ (TS Inter Exams) ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఇంటర్ బోర్డ్ (Telangana Inter Board) మార్చిలో ప్రకటించింది. ఈ నెల 24వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు ఈ నేపథ్యంలో అధికారుల పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక వసతులు కల్పించారు. పరీక్షల కోసం 1,443 కేంద్రాలు సిద్ధంచేశారు. వీటిలో 26 సెల్ఫ్ సెంటర్లు ఉన్నాయి. 386 ప్రభుత్వ, 206 గురుకులాలు, 840 ప్రైవేట్ కాలేజీలు, 11 ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,07,393 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పాటించాల్సిన రూల్స్
- విద్యార్థులు ఉదయం 8:30 గంటలకు ముందే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలి.
- నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జె్‌లను అనుమతించరు.
- ఆన్సర్ షీట్ ఇవ్వగానే దానిపై ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్, ఓఎంఆర్ షీట్ పై ఉన్న రిజిస్టర్డ్ నంబర్ ఒకటేనా? కాదా? అన్నది విద్యార్థులు సరి చూసుకోవాలి. లేకపోతే ఫలితాల్లో తప్పులు వచ్చే అవకాశం ఉంటుందని బోర్డు హెచ్చరించింది.
- విద్యార్థులు ఆన్సర్ బుక్ పై పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి వివరాలను అస్సలు రాయవద్దని బోర్డు సూచించింది.
ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే అంశంపై ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా, నోడల్ అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్టు తెలిపారు. ఇన్విజిలేటర్లు సైతం ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశించారు.
ఫస్ట్ ఇయర్ పేపర్లకు సెకండ్ ఇయర్ లో ఇంప్రూవ్‌మెంట్
అయితే ఈసారి ఇంటర్ విద్యార్థులకు ఓ శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. ఫస్ట్ ఇయర్ పేపర్లకు సెకండ్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది ఇంటర్ బోర్డు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పేపర్లకు సెకండ్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాస్తే ఏ పరీక్షలో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. ఆ మార్కులతోనే ఇంటర్ మెమో వస్తుంది. గతంలో ఉన్న విధానం చూస్తే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాలు వెలువడిన తర్వాత నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లోనే ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే ఛాన్స్ ఉండేది.
కానీ ప్రస్తుతం ఇంటర్ బోర్డు మార్చిన విధానం ప్రకారం గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాసైన విద్యార్థులు ఈ ఏడాది జరగబోయే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల సమయంలో ఇంప్రూవ్‌మెంట్ రాసుకునే అవకాశం కల్పించింది. గతేడాది మార్కులు, ఇంప్రూవ్‌మెంట్‌లో వచ్చే మార్కులను పరిశీలించి ఎందులో ఎక్కువ మార్కులు వస్తే ఆ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
గతేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో వారికి 35 శాతం మార్కులు వేసి పాస్ చేశారు. సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్ రాసే ఛాన్స్ ఇస్తామని అప్పుడే ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. గతంలో ప్రకటించినట్టుగా ఇప్పుడు విద్యార్థులకు సెకండ్ ఇయర్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసే అవకాశం ఇస్తున్నారు. ఈ అవకాశం ఈ ఒక్క ఏడాది మాత్రమే ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి పాత విధానం అమల్లోకి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, Intermediate exams, Telangana inter board