ఒక ఉద్యోగం (Job) నుంచి మరొక ఉద్యోగానికి మారడం (Job Transition) అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రక్రియలో ఉద్యోగులు చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు వారిపై ఆర్థికంగా ఒత్తిడి కూడా పెరుగుతుంది. మరోవైపు ఉన్నపళంగా ఒక ఉద్యోగి మానేస్తే వారి స్థానంలో మరొకరిని భర్తీ చేయడం కంపెనీలకు కూడా పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒకవేళ కంపెనీయే తీసేయాల్సి వస్తే ఉద్యోగులకు చాలా బాధ వేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా తాజాగా ఒక అమెరికన్ కంపెనీ వినూత్న ఆలోచన చేసింది. 'గొరిల్లా 76 (Gorilla 76)' అనే మార్కెటింగ్ కంపెనీ.. సంస్థ నుంచి వెళ్లిపోతున్న ఉద్యోగులకు నోటీస్ పీరియడ్‌లో 10% శాలరీ పెంపును ఆఫర్ చేస్తోంది.
అంటే జాబ్ మానేస్తున్న ఉద్యోగులు గొరిల్లాలో ఇంకా ఎంత కాలమైతే పని చేస్తారో ఆ సమయానికి 10 శాతం జీతం పెరుగుతుంది. అలా శాలరీ పెంచేసి తన ఉద్యోగులకు ఉద్యోగం మానేయడాన్ని కంపెనీ సులభతరం చేస్తుంది. ఈ కంపెనీ జాబ్ మానేస్తున్న ఉద్యోగులను మూడు నెలల్లోగా వెళ్లిపోవాలని కోరుతుంది.
జాబ్ మానేస్తున్నానని నోటీసు ఇచ్చి తన నిర్ణయాన్ని చెప్పిన ఫుల్-టైమ్ ఉద్యోగికి గొరిల్లా కంపెనీ 10% పెంపును అందిస్తుంది. ఈ శాలరీ హైక్ పొందాలంటే వారు కనీసం 6 వారాల నోటీసు పీరియడ్ అందించాల్సి ఉంటుందని గొరిల్లా వ్యవస్థాపకుడు జోన్ ఫ్రాంకో తాజాగా వెల్లడించారు. ఆరు వారాలకు ముందే నోటీసు పీరియడ్ అందించడం వల్ల కంపెనీ నష్టపోకుండా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనే దానిపై ఆలోచించడానికి తగిన సమయం దొరుకుతుందని ఫ్రాంకో లింక్డ్‌ఇన్‌లో రాశారు.
జాబ్ మానేసే లేదా కోల్పోయే ఉద్యోగులు కోపం, బాధ, నిరాశ లాంటి ఫీలింగ్స్ ఏవీ పెట్టుకోకుండా కంపెనీ జీతం పెంపు అందజేస్తోందని ఫ్రాంకో పేర్కొన్నారు. "వేరే జాబ్ చేయాలనుకున్నా మా కంపెనీలో ఇరుక్కుపోయామని ఫీల్ అయ్యే ఉద్యోగులకు మేం ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చిన పద్ధతి బాగా హెల్ప్ అవుతుంద"ని ఆయన అన్నారు.
అయితే శాలరీ పెంపు కోసమే ఉద్యోగం మానేయాలని తామెప్పుడూ ఎవర్ని ఎంకరేజ్ చేయమన్నారు. కానీ ఒక ఉద్యోగి ఏదో ఒక సమయంలో కంపెనీని విడిచి పెట్టే సమయం వస్తుందని.. సరిగ్గా ఆ సమయంలోనే తాము వారికి హెల్ప్ చేయడంతో పాటు కొత్తవారిని భర్తీ చేయడానికి తమ కొత్త విధానం బాగా పనికొస్తుందని వివరించారు.
ఉద్యోగులకు వీడ్కోలు పలికే ఈ గొప్ప విధానాన్ని చాలామంది లింక్డ్‌ఇన్ యూజర్లు మెచ్చుకుంటున్నారు. కంపెనీలో ఉండాలనుకున్నా శాలరీ పెరుగుదల కోసమే ఎవరైనా నోటీస్ పీరియడ్ అందజేస్తే కంపెనీ నష్టపోతుంది కదా అని కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అలాగే ఒక వ్యక్తి పదేపదే నోటీస్ పీరియడ్ అందజేస్తూ ఉంటే ఇబ్బంది కదా అని ఇంకొందరు ప్రశ్నలు వేశారు.
అయితే పదేపదే నోటీస్ పీరియడ్ అందజేస్తే ఏం చేయాలనేది ఇంకా ఆలోచించలేదని వెల్లడించారు. అలానే కంపెనీలో ఉండాలనుకునేవారికి, వెళ్లిపోతున్నామని చెప్పిన ఉద్యోగుల కంటే ఎక్కువ బెనిఫిట్స్ దక్కుతాయని, అందువల్ల 10 శాతం హైక్ అకారణంగా పొందే వారికి ఎక్కువ లాభం ఉండదన్నట్లు ఫ్రాంకో వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Salary Hike