THEY ARE RESPONSIBLE FOR FAILING THE CLASS 10 EXAMS IN GOVERNMENT SCHOOLS
సర్కారీ బడుల్లో పది ఫెయిలైతే.. వాళ్లదే బాధ్యత..
ప్రతీకాత్మకచిత్రం
హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివే విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే.. ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులదే బాధత్య. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటుండడం గమనార్హం.
హైదరాబాద్ మహానగరంలో మీ పిల్లలు పదో తరగతి చదువుతున్నారా..?. అయితే ఇది మీ కోసమే.. మీ పిల్లలు పదో తరగతిలో ఫెయిలైతే.. అందుకు బాధ్యులు మీరో.. మీ పిల్లల్లో కాదండోయ్.. మీ పిల్లలకు చదువుచెప్పిన సర్కారు పంతుళ్లదే. అదేంటి అనుకుంటున్నారా.. అవును మీరు చదివింది నిజమే. పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ జిల్లాను పైస్థాయికి తీసుకొచ్చేందుకు విద్యాశాఖ అధికారులు తీసుకున్ననిర్ణయం ఇది. జిల్లా పరిధిలోని ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఏ సబ్జెక్టు పరీక్షల్లో ఫెయిలైతే.. ఆ సబ్జెక్టుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులదే బాధ్యత అంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాటిని మాటలకే పరిమితం చేయకుండా.. సదరు ఉపాధ్యాయుల నుంచి అండర్ టేకింగ్ తీసుకుంటున్నట్టు సమాచారం.. దీంతో ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందం’గా విద్యార్థుల మార్కులు.. ఉపాధ్యాయులకు పెద్ద సమస్యగా మారింది. ఫలితంగా ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచడం, ఉపాధ్యాయుల పనితీరును మెరుగుపర్చడం వంటి అంశాలను పెంచేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
ఉపాధ్యాయుల నుంచి తీసుకునేందుకు రూపొందించిన అండర్ టేకింగ్ పత్రం
ఇదిలావుంటే.. పదో తరగతి ఫలితాల్లో దాదాపుగా హైదరాబాద్ జిల్లా ఎప్పుడూ వెనుకంజలోనే ఉంటోంది. ఎందరు జిల్లా విద్యాశాఖ అధికారులు మారినా.. పదో తరగతి ఫలితాల విషయంలో హైదరాబాద్ జిల్లా నిరుత్సాహానే మిగిలిస్తోంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్ జిల్లా కొంత అడ్వాన్స్డ్ గా ఉంటుంది. అయినా ఫలితాల్లో మాత్రం చివరి స్థానాల్లోనే నిలుస్తుండడం గమనార్హం.
Published by:Vijay Bhaskar Harijana
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.