Education loans: ఉన్నత విద్యకు రుణాలు ఇస్తున్న బ్యాంకులు... ఈ బ్యాంకుల్లో వడ్డీ చాలా తక్కువ

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో ఉన్నత విద్యకు ఖర్చు విపరీతంగా పెరిగి పోయింది. దీంతో సాధారణ ప్రజలు తమ పిల్లలను ఉన్నత విద్యకు పంపించలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్లను తక్కువ వడ్డీకే అందిస్తున్నాయి. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులు ఉన్నత విద్యను సులువుగా పూర్తి చేయొచ్చు.

  • Share this:
ఒకప్పటితో పోలిస్తే ఉన్నత విద్య కోసం చేయాల్సిన ఖర్చులు భారీగా పెరిగాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం, ఇతర కారణాలతో ఉన్నత విద్యకు కేటాయించాల్సిన మొత్తం పెరుగుతోంది. భారతీయులు తమ పిల్లల ఉన్నత విద్య కోసం వారి వార్షిక ఆదాయంలో 13 శాతం వరకు ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే తేల్చింది. ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలు ఇంకా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటిని భర్తీ చేయడానికి చాలామంది తల్లిదండ్రులు విద్యా రుణాలు (ఎడ్యుకేషన్ లోన్లు) తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంతో పాటు విదేశాల్లో చదువులకు కూడా అన్ని బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. ఎడ్యుకేషన్ లోన్‌ను తల్లిదండ్రులు లేదా విద్యార్థులు తీసుకోవచ్చు. కోర్సు పూర్తయిన తరువాత, ఉద్యోగం వచ్చిన తరువాత లోన్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఇలాంటి సౌలభ్యం ఉంది కాబట్టి ఎడ్యుకేషన్‌ లోన్లకు ఆదరణ పెరుగుతోంది.

ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏడుశాతం కంటే తక్కువ వడ్డీతో ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి బ్యాంకులు వరుసగా 6.8 శాతం, 6.85 శాతం, 6.85 శాతం వడ్డీతో విద్యా రుణాలు మంజూరు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకుల్లో ఇది పది శాతం వరకు ఉంది. HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు వరుసగా 9.55 శాతం, 9.70 శాతం, 10.50 శాతం వడ్డీ విధిస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అతి తక్కువగా 6.8 శాతంతో ఎడ్యుకేషన్ లోన్లు ఇస్తుండగా.. ఇండియన్ బ్యాంకు అత్యధికంగా 7.15 శాతం వడ్డీ విధిస్తోంది.

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో వడ్డీ రేట్లలో రెండు శాతం వరకు తేడాలు ఉన్నాయి. అందువల్ల వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులను ఎడ్యుకేషన్ లోన్ కోసం ఎంచుకోవాలి. పర్సనల్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్ల కాలపరిమిలో (లోన్ టెన్యూర్) తేడాలు ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు తీసుకునేవారికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. కానీ ఎడ్యుకేషన్ లోన్లకు అత్యధికంగా 15 సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. ఈ సౌలభ్యం కారణంగా ఎక్కువమంది తల్లిదండ్రులు, విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్లను ఎంచుకుంటున్నారు.

ఇతర ప్రయోజనాలు కూడా..
ఎడ్యుకేషన్ లోన్‌పై చెల్లించే వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. లోన్ తిరిగి చెల్లించడం ప్రారంభించిన సంవత్సరం నుంచి ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. అందువల్ల విద్యారుణాలు తీసుకున్నవారు లోన్‌ను తిరిగి చెల్లించేందుకు ఎనిమిది సంవత్సరాలను గడువుగా పెట్టుకుంటే ట్యాక్స్ మినహాయింపుల ద్వారా ఎక్కువ లబ్ధి పొందవచ్చు. కానీ ఇక్కడ మరో నియమం ఉంది. ఎడ్యుకేషన్‌ లోన్‌ అసలు మొత్తంపై ఎలాంటి మినహాయింపులు ఉండవు. కేవలం వడ్డీపై మాత్రమే ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.
First published: