తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడ్డాక గురుకుల పాఠశాలలకు (Gurukul educational institutions) ప్రాధాన్యత పెరిగింది. 1980 దశకంలో ప్రముఖ మానవతావాది, అణగారిన వర్గాల పక్షపాతి, సామాజిక మార్పు పట్ల దూరదృష్టి కలిగిన ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ ఆలోచనలతో సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాసంస్థలు రూపుదిద్దుకున్నాయి. గత ముప్పై ఐదేళ్ళలో అవి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుని నేడు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మారాయి. కాగా, వాటిల్లో ప్రవేశాలకు ప్రభుత్వం కొన్ని విధివిధానాలు ఖరారుచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో గురుకుల విద్యాసంస్థల్లో (Gurukul educational institutions) ప్రవేశాలకు విద్యార్థి స్థానికతే కీలకం కానుంది. రెండు కేటగిరీల్లో స్థానికతను ( Locality) విశదీకరిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. శాసనసభ నియోజకవర్గం యూనిట్ (Legislative Constituency Unit)గా స్థానికతను గుర్తించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ తర్వాత జిల్లా యూనిట్ (District Unit)గా స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. 2022–23 విద్యాసంవత్సరానికి సంబం ధించిన ప్రవేశాల ప్రక్రియను స్థానికత ఆధారంగానే నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థలు నిర్ణయించాయి. ప్రతి గురుకుల పాఠశాలలో 50 శాతం సీట్లను అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక విద్యార్థులకే కేటాయించనున్నారు.
ప్రత్యేకంగా అర్హత పరీక్ష..
షెడ్యూల్డ్ కులాల, తెగల గురుకుల విద్యాసంస్థలతో పాటు మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల, మైనారిటీ వర్గాల గురుకుల విద్యా సంస్థలు రాష్ట్ర మంతటా వ్యాప్తి చెందాయి. మునుపు కేవలం పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలకు పరిమితమైన గురుకుల విద్యా సంస్థలు, అండర్ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ విద్యా సంస్థల ఏర్పాటు, నిర్వహణ స్థాయికి ఎదిగాయి. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో వీటి ఏర్పాటుకు పూనుకోవడంతో ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో కేవలం 298గా ఉన్న విద్యాసంస్థలు ఇప్పుడు 1401కు పెరిగాయి. వీటిలో దాదాపు ఐదున్నర లక్షల పైచిలుకు విద్యార్థులు మెరుగైన విద్యావకాశాలు పొందుతున్నారు.
ఫలితాలు వచ్చే వారం..
తెలంగాణలో గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా అర్హత పరీక్ష ఉంటుంది. మహాత్మాజ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ, తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీలు కలసి ఐదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడిగా వీటీజీసెట్ నిర్వహిస్తున్నాయి. నాలుగు గురుకుల సొసైటీల్లో ఐదోతరగతిలో ప్రవేశాలకు మే 8న వీటీజీసెట్–2022 అర్హత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వెలువడే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితాలు ప్రకటించిన వెంటనే అర్హత సాధించిన విద్యార్థులకు సంబంధిత పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు.
కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు..
అర్హత పరీక్ష ఉమ్మడిగా నిర్వహించినప్పటికీ విద్యార్థులను కేటగిరీలుగా విభజించి ప్రవేశాలు కల్పిస్తున్నారు. కాగా, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి సీట్లను భర్తీ చేస్తోంది. నియోజకవర్గం, జిల్లా యూనిట్ల ఆధారంగా సీట్లు భర్తీ చేసినా.. ఇంకా మిగిలితే అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.