నిరుద్యోగులకు పండుగ సమయంలో తీపి కబురు అందింది. టీఎస్‌పీఎస్సీ (TSPSC) చేపట్టిన గ్రూప్-1 ఉద్యోగ (Group 1 Jobs) నియామకాలకు తెలంగాణ హైకోర్టు (High court) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, మహిళల రిక్రూట్‌మెంట్‌కు విడిగా రిజర్వేషన్లు ఇవ్వడం సరికాదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా మొత్తం పోస్టుల్లో రిజర్వేషన్, జనరల్ క్యాటగిరీలో 33% చొప్పున మహిళలకు కేటాయించాలని తెలిపింది. సమాంతర రిజర్వేషన్ల (Reservations)విధానానికి కట్టుబడి ఉండాలి గాని నేరుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సరికాదంటూ దాఖలైన రిట్ పిటిషన్‌పై జస్టిస్ పీ మాధవీదేవి శుక్రవారం విచారణ చేపట్టారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఎకువ మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే నేరుగా మహిళా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని..
పిటిషనర్ తరఫు న్యాయవాది చంద్రయ్య వాదిస్తూ.. ఉద్యోగ నియామకాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు అభ్యంతరం లేదని అన్నారు. అయితే, మహిళలకు విడిగా రిజర్వేషన్ల (Women Reservations) కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చంద్రయ్య పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు గ్రూప్-1 పోస్టుల నియామాకాలను కొనసాగించవచ్చునని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.
తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటన మేరకు ఇటీవల వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) మరో కీలక ప్రకటన చేశారు. వైద్యశాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిమ్స్ హాస్పటల్ లో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Telangana Jobs Notification) విడుదల చేయనున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీల్లో వెయ్యి మంది డాక్టర్ల భర్తీకి రాబోయే పది రోజుల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు చెప్పారు. మరో 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తారని మంత్రి చెప్పారు.
ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ శాఖలో(Panchayat Raj Department) కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో పంచాయతీ రాజ్ శాఖలో ఈ పోస్టులను మంజూరు చేసినట్లు ఆ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు(Hanumanth Rao) ఇటీవల జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో జూనియర్ అసిస్టెంట్ 253, సూపరింటెండెంట్ 103, సీనియర్ అసిస్టెంట్ 173 పోస్టులు ఉన్నాయి. మొత్తం 529 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులను అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 1, Hyderabad, Jobs in telangana, TSPSC