కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సంస్థల్లో కర్లికల్ పోస్టులను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఏటా రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంటుంది. తాజాగా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ (CBIC & CBN) పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 17తో ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్- బి, గ్రూప్-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని మల్టీ-టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ (ఎమ్జీఎస్)- 2022 పరీక్షలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ పరీక్ష కేవలం హిందీ, ఆంగ్లంలో నిర్వహిస్తున్నారు. దీంతో దక్షిణ భారతదేశంలోని నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వీటిపై ప్రభుత్వానికి తమిళనాడు , కర్ణాటక నుంచి కూడా కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తులు చేశారు.
ఇప్పటికే ఐబీపీఎస్ రూరల్ రీజియన్ బ్యాంక్ ఉద్యోగాలకు ప్రాంతీయ భాషలో పరీక్షలను నిర్వహిస్తోంది. తాజాగా నిరుద్యోగుల నుంచి వచ్చిన డిమాండ్ తో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
"భాష కారణంగా ఎవరూ అవకాశాలు కోల్పోవ ద్దన్న ప్రధాని మోదీ ఆకాంక్ష మేరకు హిందీ, ఆంగ్లంతో పాటు ఉర్దూ, తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ ఎస్ఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నాం. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న మిగతా భాషలనూ పరీక్షలో క్రమంగా చేర్చుతాం" అని ఆయన అన్నారు. అంటే ఇక నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహించే పరీక్షలను తెలుగులో కూడా నిర్వహించనున్నారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(MTS)- 10,880, హవల్దార్ (CBIC & CBN) -529 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్ తో పాటు.. మరో 13 ప్రాంతీయ భాషలో కూడా ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
విద్యార్హతలు..
అభ్యర్థులు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి కటాఫ్ తేదీ ఫిబ్రవరి 17, 2023 కంటే ముందుగా పదికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. CBN (రెవెన్యూ శాఖ)లో MTS, హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు జనవరి 1 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. CBIC (రెవెన్యూ శాఖ)లో హవల్దార్, కొన్ని MTS పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థి వయసు జనవరి 1, 2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
అన్ రిజ్వర్డ్, బీసీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు. వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Ssc jobs, Staff Selection Commission