TELANGANA UNEMPLOYMENT ALLOWANCE CM K CHANDRASEKHAR RAO LIKELY TO ANNOUNCE HIGH LEVEL COMMITTEE ON JOBLESS ALLOWANCE BA
Telangana Unemployment Allowance: నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ చేయబోయే ప్రకటన ఇదే..
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తారంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తారంటూ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం ప్రకటన చేస్తారా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సీఎం కేసీఆర్ దీనిపై ఓ ప్రకటన చేయనున్నారు. అది ఎలాంటి ప్రకటన అంటే నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇవ్వాలి? ఎప్పటి నుంచి ఇవ్వాలి? దాని వల్ల ఎంత ఖర్చవుతుంది? నిరుద్యోగులు అనే పదానికి ప్రాతిపదిక ఏంటి? తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వివిధ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్నవారిని పరిగణించాలా? లేకపోతే తెలంగాణలోనే ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లో దరఖాస్తు చేసుకున్నవారిని పరిగణనలోకి తీసుకోవాలా? గతంలో దరఖాస్తు చేసుకున్నవారికి ఈ మధ్యలో ప్రభుత్వ, లేదా ప్రైవేటు జాబ్స్ వస్తే ఎలా? ప్రైవేటు జాబ్స్ చేస్తూ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లోనూ లేకపోతే టీఎస్పీఎస్సీలోనూ దరఖాస్తులు చేసుకుంటే వారిని నిరుద్యోగుల కేటగిరీలోకి చేర్చవచ్చా? ఇలాంటి చాలా అంశాలు గజిబిజిగా ఉన్నాయి. మొదట వీటిపై ఓ క్లారిటీ తీసుకొచ్చేందుకు ఓ హై లెవల్ కమిటీ వేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్ ద్వారా సుమారు 25 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 8లక్షల మంది 25 ఏళ్ల లోపు వారు ఉన్నారు. 25 లక్షల మందిలో 14 లక్షల మంది పురుషులు ఉన్నారు. 11 లక్షల మంది మహిళలు. వారిలో పెళ్లయిన మహిళలు ఉంటే వారికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వాలా? లేదా? అనేది కూడా ఓ డౌట్. అలాగే, తెలంగాణలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారా సుమారు 9 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో కొందరు డిగ్రీ చదువుకున్నవారు ఉన్నారు. మరికొందరు పీజీ చేసిన వారు కూడా ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నిరుద్యోగులకు నెలకు రూ.3016 భృతి ఇస్తామని ప్రకటించారు. ఈ లెక్కన రాష్ట్రంలో 10 లక్షల మందిని నిరుద్యోగులుగా ఎంపిక చేస్తే వారికి నెలకు సుమారు రూ.300 కోట్ల చొప్పున ఏడాదికి రూ.3600 కోట్లు ఖర్చవుతుంది. అదే 20 లక్షల మంది నిరుద్యోగులను ఎంపిక చేసి వారికి నెలకు రూ.3016 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి రూ.6200 కోట్ల భారం పడుతుంది.
అసలు ఎంత మందిని నిరుద్యోగుల కింద లెక్కించాలనేది కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఎంత ఎక్కువ మంది నిరుద్యోగులను ఎంపిక చేస్తే అంత మంది నిరుద్యోగులు ఉన్నారని ప్రతిపక్షాలు మండిపడతాయి. ఒకవేళ తక్కువ సంఖ్యలో నిరుద్యోగులను ఎంపిక చేస్తే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తోందని ఆరోపిస్తాయి. తాజాగా, మంత్రి కేటీఆర్ ప్రకటించిన వివరాల ప్రకారం తెలంగాణలో టీఆర్ఎస్ ఆరున్నరేళ్ల పాలనలో ప్రభుత్వ, ప్రభుత్వ రంగంలో లక్షా 31వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. 14 లక్షల ఉద్యోగావకాశాలను ప్రైవేటు రంగంలో కల్పించారు.