తెలంగాణలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్, గిరిజన పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నట్టు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆన్లైన్ క్లాసులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ క్లాసుల నిర్వహణపై అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు ఉన్న విద్యార్థులను ఒక గ్రూపుగా, టీశాట్, దూరదర్శన్ ద్వారా డిజిటల్ క్లాసులు అటెంట్ అయ్యే విద్యార్థులను మరో గ్రూపుగా విభజించి క్లాసులు తీసుకోవాలని తెలిపారు. దూరదర్శన్, టీశాట్ ద్వారా క్లాసులు పూర్తైన తర్వాత విద్యార్థులకు టీచర్లు ఫోన్ చేసి సందేహాలు తీర్చాలని, హోమ్ వర్క్ ఇవ్వాలని సూచించారు.
లాక్డౌన్ నుంచే గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఓక్స్ యాప్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో చదివే 4049 మంది విద్యార్థులకు స్టెప్ యాప్ ద్వారా తరగతులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 24 నుంచి టీశాట్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మన టీవీలో పాఠాలు ప్రసారం అవుతున్నాయి. 64 మంది టీచర్లు, 16 మంది జూనియర్ లెక్చరర్లు, 8 మంది డిగ్రీ లెక్చరర్లు డిజిటల్ క్లాసుల్ని బోధిస్తున్నారు. ఇక ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు జూమ్ యాప్ ద్వారా డిజిటల్ క్లాసులు కొనసాగుతున్నాయి. డిజిటల్ పద్ధతిలోనే నీట్, ఐఐటీ కోచింగ్ కూడా ఇవ్వడం విశేషం.
ఇకపై ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గిరిజన సంక్షేమ శాఖకు చెందిన అన్ని పాఠశాలల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు ఉంటాయి. వారానికి నాలుగు రోజులు మాత్రమే క్లాసులు ఉంటాయి. మిగిలిన రెండు రోజులు టీచర్లు గ్రామాలకు, తండాలకు వెళ్లి డిజిటల్ క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంటారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.