news18-telugu
Updated: June 6, 2020, 3:00 PM IST
ప్రతీకాత్మక చిత్రం
పదో తరగతి పరీక్షలకు సంబంధించి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కీలక హామీ ఇచ్చింది. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని, అయితే, వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణిస్తామని హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పరీక్షల మీద దృష్టి పెడుతోందని, అయితే, రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ వాదించారు. పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది. దీనిపై ఏజీ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా.. సాంకేతిక అంశాలు ముఖ్యమా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం చెబుతామని హైకోర్టుకు ఏజీ తెపడంతో విచారణ 4 గంటలకు వాయిదా పడింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
June 6, 2020, 3:00 PM IST