తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు త్వరలోనే శుభవార్త వినే అవకాశముంది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన సవరణ సంఘం (PRC) ప్రతిపాదించింది. ఉద్యోగుల కనీస వేతనం 19వేలుగా ఉండాలని. . గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండవచ్చని తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 ఏళ్లకు పెంచాలని పీఆర్సీ ప్రతిపాదించింది. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్ సిఫార్సు చేసింది. ఇటీవలే ప్రభుత్వానికి పీఆర్సీ సమర్పించిన ఈ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందజేయనుంది ప్రభుత్వం. అనంంతరం పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు.
పీఆర్సీ చేసిన ప్రతిపాదనలు:
మూల వేతనంపై 7.5 శాతం ఫిట్మెంట్
ఉద్యోగుల కనీస వేతనం రూ.19 వేలు
ఉద్యోగం గరిష్ఠ వేతనం రూ. 1,62,070
ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంపు
గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు
శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు
హెచ్ఆర్ఏ తగ్గింపు
సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు
కాగా, ప్రభుత్వ ఉద్యోగల వేతన సవరణ, పదోన్నతులకు సంబంధించి ఇటీవలే అధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. ఉద్యోగుల పీఆర్సి , ప్రమోషన్లు సహా ఇతర ఉద్యోగ సమస్యలపై వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ఆద్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలను ప్రారంభించాలని ఆదేశించారు. వారం, పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను జనవరి 24న సీఎం ఆదేశించారు. ఉద్యోగులతో చర్చల అనంతరం ఆ త్రిసభ్య కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగా ఉద్యోగుల జీతాల పెంపు, ప్రమోషన్లపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకున్నారు.