తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఖాళీల గుర్తింపు ప్రక్రియలో అధికారులు వేగం పెంచారు. శాఖల వారీగా సంబంధిత మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీల గుర్తింపు పై గత కేబినెట్ లో ఇచ్చిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర క్రీడా, పర్యాటక, సాంస్కృతిక తదితర శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీల పై రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, హెరిటేజ్ తెలంగాణ శాఖలలో ఉన్న ఉద్యోగాల ఖాళీల పై శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజుతో మంత్రి సమీక్షించారు. ఉద్యోగ ఖాళీల పునర్ వ్యవస్థీకరణ (Reorganization) పై ప్రధానం గా ఈ సమావేశంలో చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ప్రతీ ఖాళీ ని భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాళీలను దృష్టిలో పెట్టుకొని నివేదిక తయారు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు శాఖకు కేటాయించిన పోస్టుల్లో గల ఖాళీల పై సమగ్రంగా చర్చించారు. జోన్ల విభజన పూర్తి కావడంతో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీని త్వరగా చేయాలనే సంకల్పానికి అనుగుణంగా ఖాళీలను పూర్తిగా భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్క ఖాళీని భర్తీ చేసి ఇటు నిరుద్యోగులకు, అటు శాఖ లో పూర్తి స్టాప్ తో పనులను ఇబ్బంది లేకుండా జరిగేలా చూసుకోవాలని సూచించారు. త్వరలోనే ఉద్యోగ ఖాళీల పూర్తి సమాచారాన్ని సీఎం కేసీఆర్ కి అందజేస్తామన్నారు.
మంత్రి తలసాని సమీక్ష:
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ రాంచందర్, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల లో ఉన్న ఉద్యోగాల ఖాళీలను గుర్తించి వాటి వివరాలు సమర్పించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అన్ని శాఖల అధికారులను ఆదేశించారని తెలిపారు.
అధికారులు సమన్వయం చేసుకొని పశుసంవర్ధక, మత్స్య శాఖల లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను సమగ్ర నివేదిక రూపంలో అందిస్తే ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. నూతనంగా ఏర్పడిన జిల్లాలు, మండలాలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇటీవల అమలులోకి వచ్చిన నూతన జోనల్ విధానంతో కూడా ఏర్పడే ఖాళీలను గుర్తించి నివేదికలో పొందుపరచాలన్నారు. ఆయా శాఖలలోని ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
రానున్న రోజులలో పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని, వాటి అమలుకు అదనపు సిబ్బంది అవసరం ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పలు పట్టణాలలో ఉన్న పశువైద్యశాలలకు వైద్య సేవల కోసం ఎలాంటి జీవాలు రావడం లేదని అలాంటి హాస్పిటల్స్ లో ఉన్న సిబ్బందిని, వివిధ హాస్పిటల్స్ లో అదనంగా ఉన్న సిబ్బందిని అవసరమైన చోటకు బదిలీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job notification, Srinivas goud, Talasani Srinivas Yadav, Telangana, Telangana government jobs