ప్రస్తుత కరోనా(Corona) పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను జనవరి 30 వరకు పొడిగించింది తెలంగాణ సర్కార్(Telangana Government). అయితే.. ఇప్పట్లో క్లాసులు మళ్లీ ప్రారంభం అవుతాయా? లేదా? అన్నది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలింది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడమే ఇందుకు కారణం. అయితే.. ఇంటర్ విద్యార్థులకు (Inter Students) ఈ సెలవు రోజుల్లో ఆన్లైన్లో క్లాసులు నిర్వహించనుంది సర్కార్. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది క్లాసులు సైతం ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సిలబస్ సకాలంలో పూర్తి కావడం కష్టమైన విషయమే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేందుకు ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ను మరింతగా పెంచనుంది. దీంతో విద్యార్థులు సులువుగా పాస్ అవుతారని ఇంటర్ బోర్డ్ భావిస్తోంది. సాధారణంగా సైన్స్, మాథ్స్ ప్రశ్నా పత్రాల్లో 2 మార్కుల ప్రశ్నాలు పది ఉంటాయి. అయితే ఈ సెక్షన్ లో ఎలాంటి ఛాయిస్ ఉండదు. పది ప్రశ్నాలకు గాను పదింటికీ విద్యార్థులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.
అయితే.. ఈ సారి 15 ప్రశ్నలు ఇచ్చి పదింటికే విద్యార్థులు సమాధానం రాసేలా అవకాశం ఇవ్వనుంది ఇంటర్ బోర్డ్. ఇలా నాలుగు మార్కుల ప్రశ్నల్లోనూ మరిన్ని ఆప్షన్లు అందించనుంది ప్రభుత్వం. ఇప్పటికే ప్రశ్నాపత్రాలను సైతం ప్రింటింగ్ కు కూడా పంపించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై బోర్డు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. ఈ సారి ఎలాగైనా ఇంటర్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. అయితే, ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనేక మంది విద్యార్థులు ఫెయిలయిన నేపథ్యంలో విద్యార్థులు సులువుగా పాస్ అవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
TS Inter Exam Fee: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్ ఫీజుపై బోర్డు కీలక ప్రకటన..
ఇదిలా ఉంటే.. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 24వ తేదీ వరకు ఫీజులు చెల్లించాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. రూ. 100 లేట్ ఫీజుతో జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ఫీజులు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డ్ తెలిపింది. రూ.500 లేట్ ఫీజుతో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇంటర్ బోర్డ్. ఇంకా ఫిబ్రవరి 14 వరకు రూ. 1000 లేట్ ఫీజుతో రూ. 2 వేల లేట్ ఫీజుతో ఫిబ్రవరి 21 వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించిందినట్లు స్పష్టం చేసింది ఇంటర్ బోర్డ్.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలయిన వారు, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇంటర్ బోర్డ్ సూచించింది. అయితే ఈ అక్టోబర్ లో నిర్వహించిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన ప్రస్తుతం సెకండియర్ విద్యార్థులకు కూడా బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. మార్కులు తక్కువగా వచ్చాయని భావించిన విద్యార్థులు ఏప్రిల్ 2022లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఆయా విద్యార్థులు పైన సూచించిన తేదీల ప్రకారం ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.