దాదాపు 2.80 లక్షల మంది అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల (TSPSC Group-1 Prelims Results) విడుదలకు లైన్ క్లీయర్ అయ్యింది. ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థికి సంబంధించిన స్థానికత వివాదంపై టీఎస్పీఎస్సీ అప్పీలుపై ఈ రోజు హైకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటరు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్‌సీని ఈ సందర్భంగా హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా.. ఫలితాలు వెల్లడించవచ్చునని టీఎస్పీఎస్సీకి తెలిపింది. అభ్యర్థి స్థానిక వివాదం తర్వాత తేలుస్తామని వెల్లడించింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్-1 ఫలితాలు విడుదల చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు ప్రారంభించింది. రేపు సాయంత్రంలోగా ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధమవుతోంది TSPSC.
నీహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో చదివారు. మిగతా.. ఒకటి నుంచి పీజీ వరకు మాత్రం తెలంగాణలో చదువుకున్నారు. తనకు స్థానికత వర్తిస్తుందని ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఫలితాల విడుదలను టీఎస్పీఎస్సీ ఆపింది. ఆమె స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన వాళ్లే స్థానికత వర్తిస్తుందని.. నీహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి విశాఖలో చదివిన కారణంగా ఆమెకు స్థానికత వర్తించదని టీఎస్‌పీఎస్సీ తరపున అడ్వకేట్ ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపించారు.
TSPSC Notification: వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు .. 148 పోస్టులకు దరఖాస్తు చేసుకోండిలా..
సింగిల్ జడ్జి ఉత్తర్వుల కారణంగా లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఫలితాల వెల్లడికి ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులకు అనుగుణంగా నీహారికతకు స్థానికత వర్తింపజేయాలని ఆమె లాయర్ సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. వాదనల తర్వాత ఒక్క అభ్యర్థి కారణంగా ఫలితాలను నిలిపివేయడం చెల్లదని, స్థానికత వివాదాన్ని తర్వాత తేల్చుతామని, దీనిపై విచారణ చేసి ఉత్తర్వులు ఇస్తామని డివిజన్ బెంచ్ తెలిపింది. ఆ అభ్యర్థికి చెందిన సమగ్ర వివరాలు నివేదించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది కోర్టు. ఫలితాలను వెల్లడించుకోవచ్చునని టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. స్థానికత వ్యవహారంపై తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Telangana government jobs, TSPSC