Home /News /jobs /

TELANGANA GOVERNMENT RELEASED GUIDELINES FOR FINANCIAL ASSISTANCE TO PRIVATE SCHOOL TEACHERS HERE FULL DETAILS NS

Telangana: ప్రైవేటు టీచర్లకు సాయంపై ప్రభుత్వ మార్గదర్శాకాలివే.. యాజమాన్యాల తీరుతో వారికి అన్యాయమేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయంపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే యాజమాన్యాల తీరుతో అనేక మంది ప్రభుత్వ సాయానికి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా ఎఫెక్ట్ తో అత్యంత తీవ్రంగా నష్టపోయిన వారిలో ప్రైవేటు టీచర్లు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు పాఠాలు బోధిస్తు, ఆత్మగౌరవంతో జీవిస్తున్న వారిని ఈ మహమ్మారి రోడ్డు మీదకు తెచ్చింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ముందు జాగ్రత్తగా స్కూళ్లను మూయడం ఇందుకు కారణమైంది. అనేక పాఠశాలలు స్కూళ్లు నడవడం లేదన్న కారణంతో ఉపాధ్యాయులను, సిబ్బందిని విధుల నుంచి తొలగించాయి. అయితే ప్రైవేటు టీచర్ల ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. వారికి తిరిగి పాఠశాలలు ప్రారంభించేవరకు నెలకు రూ. 2 వేలతో పాటు 25 కేజీల బియ్యం అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందు కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. కరోనా కంటే ప్రారంభానికి ముందు అంటే మార్చి 2020కి ముందు పని చేసిన వారినే ప్రామాణికంగా తీసుకోనున్నట్లు వెల్లడించింది. తొలగింపునకు గురైన టీచర్లకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం దాదాపు 11 వేల పాఠశాలలు ఉన్నాయి. వారిలో దాదాపు 1.45 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పని చేస్తున్నారని ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కలు చెబుతున్నాయి.

    జాబితా ఇలా..
    ఉపాధ్యాయులు ప్రభుత్వం అందించే సాయం విషయంలో ఆయా ప్రైవేటు పాఠశాలల హెచ్ఎంలు ప్రధాన పాత్ర పోషించనున్నారు. వారు తమ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితాను విద్యాశాఖ సూచించిన ఫార్మాట్లో నింపి మండల విధ్యాధికారికి అందించాల్సి ఉంటుంది.
    అప్లికేషన్లో రెండు పార్టులు ఉంటాయి. పార్ట్ ఏలో సిబ్బంది లేదా టీచర్ ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్, ఆధర్ తో లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్, ఆహార భద్రత కార్డు నంబర్, వారి రేషన్ షాపు వివరాలను ఆయా టీచర్ లేదా సిబ్బంది నింపి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను పొందే అవకాశం ఉంటుంది.

    -పార్ట్ బీ విషయానికి వస్తే ఇందులో హెచ్ఎం పాఠశాలకు సంబంధించిన వివరాలను నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎంఈవో లేదా కలెక్టర్ నియమించిన అధికారి పరిశీలించాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల పరిధిలో పని చేసే సిబ్బందికి కూడా సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ముఖ్యమైన తేదీలు:
    -ఈ నెల 10-15 వరకు టీచర్లు, సిబ్బంది వివరాలను సేకరించనున్నారు.
    -16న జిల్లా స్థాయిలో వివరాలను తనిఖీ చేయనున్నారు.
    -17 నుంచి 19 వరకు రాష్ట్ర స్థాయిలో వివరాలను తనిఖీ చేస్తారు.
    -20-24 వరకు అర్హుల బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయనున్నారు.
    -21 నుంచి 25 వరకు రేషన్ షాపు ద్వారా అర్హులకు 25 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు.

    వారందరికీ అన్యాయమేనా?
    తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10,763 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. అయితే వీటిలో దాదాపు 2 లక్షల మంది టీచర్లు పని చేస్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కల్లో మాత్రం ఉపాధ్యాయులు 1.18 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు ఉంది. 20 కన్నా ఎక్కువ మంది సిబ్బంది పని చేస్తూ ఉంటే ఆయా యాజమాన్యాలు తమ వాటాగా పీఎఫ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందు నుంచి తప్పించుకోవడానికి అనేక పాఠశాలలు తమ వద్ద తక్కువ మంది పని చేస్తున్నట్లు ప్రభుత్వాలకు లెక్కలు ఇస్తుంటాయి. దీంతో ఇప్పుడు అధికారిక లెక్కల్లో లేని వారు ప్రభుత్వం అందించే సాయానికి అనర్హత పొందే ప్రమాదం ఏర్పడింది.

    మరి మా పరిస్థితి ఏంటి?
    కరోనా కారణంగా అనేక ప్రైవేటు కళాశాలలు తమ సిబ్బందిని తొలగించాయి. కొద్ది మంది లెక్చరర్లతో ఆన్లైన్ క్లాసులను కొనసాగిస్తున్నాయి. దీంతో అనేక మంది ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. వారు కూడా తమకు ప్రభుత్వ సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు కరోనా ప్రారంభం నాటికి రాష్ట్రంలో దాదాపు 13 వేల మంది విద్యా వాలంటీర్లు పని చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా వారిని ఈ ఏడాది విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారు కూడా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. తమకు కూడా ప్రభుత్వ సాయాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు లెక్చరర్లు, విద్యావాలంటీర్ల విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Private school, Telangana, Telangana Government, Telangana schools

    తదుపరి వార్తలు