TELANGANA GOVERNMENT PRC ANNOUNCEMENT AND JOB NOTIFICATIONS AFTER MARCH 17 ONLY DUE TO MLC ELECTIONS SCHEDULE NS
Telangana: తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులకు షాక్.. ఇప్పట్లో ఆ ప్రకటనలు లేనట్లే..
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
Telangana PRC: కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం లేకుండా పోయింది.
కేంద్ర ఎన్నికల సంఘం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ను ఈ రోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీపై ప్రకటన చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది. మార్చి 17న ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు. అప్పటి వరకు కోడ్ అమలులో ఉంటుంది. దీంతో దాదాపు ఉద్యోగులు దాదాపు నెలకు పైగా వేతన సవరణ ప్రకటన కోసం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ శాసన సభ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో అక్కడ ఉప ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. అయితే అతి త్వరలోనే ఆ ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే నాటికి ఆ నోటిఫికేషన్ విడుదలైతే మరి కొన్ని రోజులు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే పీఆర్సీ ప్రకటన మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం కాలయాపన కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిరుద్యోగుకు కూడా నిరాశే..
రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేస్తామని కొద్ది కాలం క్రితం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్ ప్రారంభించారు. లక్షలాది మంది కోచింగ్ కోసం నగరాల బాట పట్టారు. శాఖల వారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మరి కొద్ది రోజుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతాయని వార్తలు వస్తున్న వేళ గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఈ సమయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో నిరుద్యోగుల్లోనూ తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి కూడా ఇబ్బందే..
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ అనంతరం ఉద్యోగ, నిరుద్యోగ వర్గాల్లో తమపై తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన టీఆర్ఎస్ సర్కార్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న పీఆర్సీ, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. ఈ నోపథ్యంలోనే పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందింది. ప్రమోషన్ల ప్రక్రియను సైతం ప్రారంభించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి ఆయా వర్గాలను తమ వైపునకు తిప్పుకోవాలని ప్రభుత్వం భావించింది.
కానీ.. ఈ లోగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రభుత్వానికి సైతం ఇబ్బందిగా మారింది. భారీగా ఉద్యోగాను భర్తీ చేస్తామని చేసిన ప్రకటన అనంతరం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడం.. పీఆర్సీపై ప్రకటించక ముందే గ్రాడ్యుయేట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ వర్గాల్లోనూ కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఎఫెక్ట్ గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండొచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.