తెలంగాణలో కొలువుల జాతర (Telangana Govt Jobs) కొనసాగుతోన్న విషయం తెలుస్తోంది. వరుసగా నోటిఫికేషన్ల విడుదలతో నిరుద్యోగ వర్గాల్లో సందడి వాతవారణం నెలకొంది. ఈ నేపథ్యంలో మరో భారీ నోటిఫికేషన్ కు (TS Job Notification) సంబంధించిన అప్డేట్ వచ్చింది. 4,661 స్టాఫ్ నర్స్ ఖాళీలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 31లోపే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నియామక పరీక్ష ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి పరీక్ష కోసం రెండు నెలల సమయం ఇవ్వనున్నారు. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే.. రాత పరీక్ష నిర్వహణ బాధ్యతను మాత్రం జేఎన్టీయూ లేదా మరో స్వతంత్ర సంస్థకు అప్పటించే అవకాశం ఉంది.
ఈ నియామకాల్లో ప్రభుత్వ వైద్య కాలేజీల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న వారికి వెయిటేజీ ఉంటుంది. నియామక పరీక్షలో మార్కులకు 80 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పందం, ఔట్ సోర్సింగ్ విభాగంలో పని చేసే వారికి 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి అధికంగా వెయిటేజీ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
వారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వేయిటేజీ ఉండనుంది. అయితే అభ్యర్థులు ముందుగా తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 23వ తేదీన గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రూప్-2 ఉద్యోగ నోటిఫికేషన్ సైతం ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ వారంలోనే నోటిఫికేషన్ వస్తుందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.