TELANGANA GOVERNMENT PLANS TO RELEASE JOB NOTIFICATION S FROM MAY FIRST WEEK HERE FULL DETAILS NS
Telangana Government Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 20 వేల పోస్టులతో తొలి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే
సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచిన తెలంగాణ సర్కార్ తాజాగా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. త్వరలో భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన వెంటనే వరుసగా జాబ్స్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. తద్వారా నిరుద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని పోగొట్టాలని సర్కార్ యోచిస్తోంది. ముందుగా అత్యధిక ఖాళీలు ఉన్న పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విదుదల కానున్నట్లు సమాచారం. పోలీస్ శాఖలో దాదాపు 20 వేల ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. దీంతో ముందుగా ఆ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ సుధీర్ఘంగా సాగుతుంది. దీంతో ముందుగా ఆ నోటిఫికేషన్ విడుదల చేస్తే సాధ్యమైనంత త్వరగా ఆ ఉద్యోగాల భర్తీని పూర్తి చేయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పోలీసు శాఖ తర్వాత అత్యధిక ఖాళీలు ఉన్న శాఖలుగా విద్య, వైద్య శాఖలను ప్రభుత్వం గుర్తించింది. దీంతో సాధ్యమైనంత త్వరగా ఆయా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగ ప్రకటనల అనంతరం గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే టీఎస్పీఎస్సీ(TSPSC)లో పూర్తి స్థాయి పాలకవర్గం లేకపోవడంతో గ్రూప్స్ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వ్యవసాయ, మునిసిపల్, ఇరిగేషన్, అటవీ శాఖల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఆయా శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని ప్రభుత్వ విభాగాల్లో కలిపి దాదాపు 55 వేల నుంచి 60 వేల వరకు ఖాళీలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. నోటిఫికేషన్ల విడుదలకు ముందు సీఎం కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఖాళీల భర్తీ ప్రక్రియ, నియామక సంస్థల గురించి సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. అయితే టీఎస్పీఎస్సీని కేవలం గ్రూప్స్ కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా నియమకాల ప్రక్రియ ఏళ్లకు తరబడి సాగకుండా సాధ్యమైనంత త్వరగా పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. మే 2న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే నాలుగైదు రోజుల్లో పోలీసు ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్ విడుదల అవడం ఖాయమని తెలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.