Home /News /jobs /

TELANGANA GOVERNMENT PLANS TO ALLOCATE RS 2000 CRORE EVERY YEAR FOR THE DEVELOPMENT OF GOVERNMENT SCHOOLS NS

Telangana: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ.. ఏటా రూ. 2 వేల కోట్లతో సకల సదుపాయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఏటా రూ. 2 వేల కోట్లు కేటాయించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఈ నిధులతో ఆయా స్కూళ్లను కార్పోరేట్ కు దీటుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ రానుంది. సర్కారు స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కార్పొరేటకు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడానికి ఏడాదికి రూ.2వేల కోట్లతో బృహత్తర విద్యా పథకం అమలు చేయనున్నట్లు కేబినెట్‌ సబ్‌ కమిటీ తెలిపింది. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో కొత్త బిల్డింగ్ లు, అదనపు తరగతి గదులు, తాగునీరు, డిజిటల్ తరగతులు తదితర మౌలిక సదుపాయాల కల్పన చేపడతామన్నారు. ఏటా రూ.2వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు తుది మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. ఈ వివరాలను సీఎంకు నివేదించనున్నట్లు తెలిపింది. మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కల్వకుంట్ల తారక రామారావు(KTR), సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాతోడ్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

    ఈ సందర్భంగా పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా కేబినెట్ సబ్ కమిటీ పలు విషయాలను వెల్లడించింది.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కార్ గురుకులాలను ఏర్పాటు చేసిందని వెల్లడించింది. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా గురుకులాల ఏర్పాటు జరిగిందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఇప్పటికే అనేక కార్యక్రమలను చేపట్టామని మంత్రి వెల్లడించారు.

    బంగారు తెలంగాణ సాధన కోసం విద్యావిధానం ఒక సాధనమని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయ పడింది. ప్రాథమిక విద్యారంగం బలోపేతం అవుతోనే ఉన్నత విద్య సమర్థంగా అమలవుతుందనేది ప్రభుత్వ అభిప్రాయమని మంత్రి వర్గం తెలిపింది. రాష్ట్రంలో పాఠశాల విద్యారంగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యారంగంపై అత్యధిక నిధులు ఖర్చు చేయబోతున్నట్లు సబ్ కమిటీ తెలిపింది.

    ఇదిలా ఉంటే.. విద్యాసంస్థలను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లకు, సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. వారిని ఆదుకుంటామని ప్రకటించారు. రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్కారు అందించే ఈ సాయం పొందడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు, ఇతర సిబ్బంది బ్యాంకు ఖాతా తదితర వివరాలతో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు.

    ఇందుకు గాను విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్షా యాబై వేల మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం కలగనుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Harish Rao, Minister ktr, Telangana, Telangana schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు