హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Telangana Private Teachers: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు షాక్.. ఇక రూ.2 వేల సాయం బంద్?

Telangana Private Teachers: ప్రైవేట్ స్కూల్ టీచర్లకు షాక్.. ఇక రూ.2 వేల సాయం బంద్?

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణలోని ప్రైవేట్ స్కూల్ టీచర్లకు ప్రభుత్వం అందిస్తున్న నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యం సాయాన్ని కేసీఆర్ సర్కార్ ఈ నెల నుంచి నిలిపివేయనుందని వార్తలు వస్తున్నాయి. దీంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా కాలంలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బంది పడ్డ వారిలో ప్రైవేటు పాఠశాలల టీచర్లు ముందు వరుసలో ఉన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఇన్నాళ్లు సమాజంలో గౌరవంగా బతికిన వీరు మహమ్మారి దెబ్బకు ఉద్యోగాలు కోల్పోయి, వేతనాలు లేక వీధిన పడ్డారు. హెడ్ మాస్టర్ గా పని చేసిన వారు కూడా మనస్సు చంపుకుని కుటుంబ పోషణ కోసం టీ స్టాళ్లు, టిఫిన్ బండ్లు, కూరగాయల షాపులు పెట్టుకున్న వార్తలు మీడియాలో వచ్చాయి. కొందరు ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో స్పందించిన సీఎం కేసీఆర్ సర్కార్ ప్రైవేటు పాఠశాలల టీచర్లతో పాటు సిబ్బందికి నెలకు రూ. 2 వేల వేతనంతో పాటు 25 కిలోల బియ్యం అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఒక్కొక్కరికీ నెలకు రూ. 2 వేలు 25 కేజీల బియ్యం చొప్పున ప్రభుత్వం అందించింది. దీంతో వారికి కొంత మేర ఉపశమనం లభించింది. అయితే ఈ నెల నుంచి ప్రభుత్వం ప్రైవేటు టీచర్లకు సాయం నిలిపివేస్తుందంటూ వార్తలు రావడం వారిలో ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో జులై 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించడంతో దీంతో ప్రైవేటు ఉపాధ్యాయులు కూడా విధుల్లోకి వచ్చారని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం.

NEP 2020: ఇకపై విద్యార్థులకు బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, ఇంటర్న్‌షిప్‌లు.. ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

Reservation: ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్... ఎక్కడంటే

దీంతో వారికి ఇక సాయం అవసరం లేదని ప్రభుత్వం అంచనాకు వచ్చిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారికి ఇక సాయం నిలిపివేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై కొందరు ప్రైవేటు టీచర్లను సంప్రదించగా.. తమ ఖాతాల్లో ఈ నెలకు సంబంధించిన రూ. 2 వేలు జమ కాలేదని చెప్పారు. బియ్యానికి సంబంధించి కూడా డీలర్ల దగ్గర నుంచి సమాచారం రాలేదని వివరించారు. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి తమకు గతంలో వచ్చే కొద్ది పాటి వేతనం కూడా నెలల పాటు రాక రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అందించిన నెలకు రూ. 2 వేల సాయం, 25 కిలోల బియ్యం తమకు ఉపశమనం కలిగించిందని వివరించారు. కానీ ప్రభుత్వం సాయం నిలిపివేయనుందంటూ వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాయం ఆపేస్తే తాము మళ్లీ పస్తులు ఉండాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సాధారణ పరిస్థితులు ఏర్పడే వారు సర్కార్ తమకు సాయం కొనసాగించాలని కోరారు. లేక పోతే మళ్లీ ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు.

First published:

Tags: CM KCR, Private school, Private teachers, Telangana employees, Telangana government jobs