TELANGANA GOVERNMENT MAY POSTPONE OR CANCEL INTER PRACTICAL EXAMS HERE FULL DETAILS NS
Telangana Inter Practical Exams: తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రద్దు చేసే ఛాన్స్..? పూర్తి వివరాలివే..
ఇంటర్ బోర్డు లోగో
తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల విషయమై ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 నుంచి ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఆ పరీక్షలను ఇప్పుడు నిర్వహించే పరిస్థితి లేదు.
గతేడాది విద్యాసంవత్సరం ముగిసే సమయంలో మొదలైన కరోనా కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ఎఫెక్ట్ తో ఈ విద్యా సంవత్సరం అంతా గందరగోళంగా సాగుతోంది. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో విద్యా సంస్థలను ప్రారంభించిన ప్రభుత్వం మళ్లీ కేసులు పెరగడంతో వాటిని మూసి వేసింది. దీంతో ఈ ఏడాది కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉంటాయా? ఉండవా? అన్న సందేహాలు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఈ నెల 7 నుంచి నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా విద్యా సంస్థలను మూసి వేయడంతో ఆ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ బోర్డు కూడా ప్రాక్టికల్ పరీక్షలను ప్రస్తుతానికి వాయిదా వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాయిదా వేయాలా? లేక రద్దు చేయాలా? అన్న అంశంపై సైతం బోర్డు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు మూడు రకాలుగా ఆలోచనలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.
అందులో ఒకటి ఏప్రిల్ 7 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి ఏప్రిల్ 10 నుంచి నిర్వహించాలని మొదటి ఆలోచనగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, జేఈఈ పరీక్షలు ముగిసిన అనంతరం చివరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించాలన్నది మరో ఆలోచనగా తెలుస్తోంది. ఒక వేళ ఇదే జరిగితే ప్రాక్టికల్ పరీక్షలు మే చివరలో జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఇంటర్ బోర్డుకు ఈ విషయమై నివేదించినట్లు తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేస్తే ఎలా ఉంటుంది? అన్న అంశంపై సైతం ఇంటర్ బోర్డు ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.. ప్రాక్టికల్ పరీక్షలను రద్దు చేస్తే వాటికి కేటాయించిన మార్కులను ఎలా వేయాలి అన్న అంశంపై సైతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒక వేళ రద్దు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే విద్యార్థులకు ఇంటర్నల్ గా అసైన్మెంట్స్ ఇచ్చి వాటికి మార్కులు ఇస్తే బెటరన్న ఆలోచనకు అధికారులు వచ్చినట్లు సమాచారం. ఆ అంశాలపై ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. అయితే నిపుణులతో చర్చించి ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం నుంచి నిర్ణయం వచ్చిన అనంతరం బోర్డు ప్రాక్టికల్ పరీక్షల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయనుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.