వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 929 సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈ రోజు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చరిత్రలో ఇంత పారదర్శకంగా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం ఇదే మొదటి సారి అని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల ఉద్యోగాల్లో మొదటి ఉద్యోగాలు పొందింది డాక్టర్లే అని మంత్రి అన్నారు. కేవలం ఆరు నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వైద్యులుగా కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగం, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న 929 మందికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. వైద్యారోగ్య శాఖ ద్వారా నిరుపేదలకు మంచి వైద్యం అందించాలని ఉద్యోగంలోకి చేరుతున్న మీకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పక్షాన, వైద్యారోగ్య శాఖ మంత్రిగా నా పక్షాన వైద్యారోగ్య శాఖ కుటుంబలోకి స్వాగతం పలుకుతున్నానన్నారు. సమాజానికి, పేదలకు సేవ చేసేందుకు ముందుకొచ్చేలా, ఇంత మంచి డాక్టర్లుగా మిమ్మల్ని తీర్చిదిద్దిన మీ తల్లిదండ్రులకు, గురువులకు మీ పక్షాన, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వీలైతే మీరు రేపే ఉద్యోగాల్లో చేరాలని సూచించారు. కొత్త సంవత్సరం మొదటి రోజే చేరిన జ్ఞాపకం మీకు మిగులుతుందన్నారు. ఆయా గ్రామాల ప్రజలు సంతోషిస్తారన్నారు.
తల్లిజన్మ ఇస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం కేవలం డాక్టర్లకే ఉందన్నారు. గ్రామీణులకు, పేదలకు మంచి వైద్యం అందించి గొప్ప డాక్టర్లుగా పేరు పొందాలని, ప్రజల మన్నలను పొందాలని కోరారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు అత్యంత పారదర్శకంగా ఎలాంటి పైరవీలు లేకుండా 929 మందికి పోస్టింగ్ ఇచ్చిందన్నారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తూ, వాటిని పరిష్కరిస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా కేవలం ఆరు నెలల కాలంలోనే భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ రిజ్వి, సెక్రటరీ గోపీకాంత్ రెడ్డి, డీపీహెచ్ శ్రీనివాస్ ను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.
కరోనా సమయంలో పనిచేసిన డాక్టర్లకు వెయిటేజీ ఇచ్చి రెగ్యులర్ రిక్రూట్మెంట్ లో అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీని అమలు చేశామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసినవారు, కరోనా సమయంలో పనిచేసిన చాలా మంది ఇప్పుడు ప్రభుత్వ వైద్యులుగా మారారన్నారు. ఇకపైనా బాగా పనిచేసి, మంచి ఫలితాలు తీసుకొచ్చే డాక్టర్లకు బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్నవారికి పీజీ సీట్లలో 20-40 శాతం రిజర్వేషన్ కల్పించామని వివరించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పీజీ డాక్టర్లుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. పీజీ పూర్తి చేసినవారిని వెంటనే టీవీవీపీ, డీఎంఈ పరిధిలోకి తీసుకుంటున్నామన్నారు. వైద్యులు నిత్య విద్యార్థులుగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ కావాలన్నారు.
Speaking at Induction Program of Newly Recruited Doctors at Shilpakala Vedika, Hitec City https://t.co/U7vaj9r5Y4
— Harish Rao Thanneeru (@trsharish) December 31, 2022
తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటి దశలో 1.47 లక్షల ఉద్యోగ నియామకాలు పూర్తి చేసుకున్నామన్నారు. ఈ ఫేజ్ లో 81 వేల ఉద్యోగాలు నింపాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో తొలి ఫలితంగా 929 మందికి నియామక పత్రాలు ఇస్తున్నం. 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. మరో మూడు నెలల్లో ఈ నియామకాలు పూర్తవుతాయన్నారు. 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. దానిని త్వరగా పూర్తి చేస్తాం. 24 ఫుడ్ ఇన్ స్పెక్టర్లు, 18 డ్రగ్ ఇన్ స్పెక్టర్లు, 1785 ఏఎన్ఎం, 1982 ఇతర సిబ్బంది.. మొత్తంగా వైద్యారోగ్య శాఖలో 10,283 ఉద్యోగ నియామకాలను రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం అన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య 21,202 అని మంత్రి చెప్పారు. ఇందులో 6431 డాక్టర్లు, 7654 స్టాఫ్ నర్సులు, 5192 పారా మెడికల్ సిబ్బంది, 1927 ఇతర సిబ్బందిని నియమించామన్నారు. వైద్యారోగ్య శాఖలో ఒక్క ఖాళీ కూడా ఉండొద్దన్నని మంత్రి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.