Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త.. ఆగస్టు నుంచే..

తెలంగాణ సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

Telangan PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. ఆగస్టు నుంచి వారు పెరిగిన వేతనాలు అందుకోనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కొత్త వేతనాలపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు తెరపడనుంది. పెరిగిన వేతనాలు ఆగస్టు నుంచి వారు అందుకోనున్నారు. ఈ మేరకు ఉద్యోగుల ఖాతాల్లో పెరిగిన వేతనాలు జమ చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి గత నెలలోనే పెరిగిన వేతనాలు ఉద్యోగులు అందుకోవాల్సి ఉంది. అయితే.. సాకేంతిక ఇబ్బందులతో పాటు అధికారిక ప్రక్రియ సకాలంలో పూర్తి కాకపోవడంతో ఉద్యోగులు పాత వేతనాలే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం వేతన సవరణ పూర్తి కావడంతో జూన్ నెల బకాయిని కూడా చెల్లించనున్నారు అధికారులు. దీంతో జూన్ నెల నుంచే పెరిగిన వేతనాలు ఉద్యోగులు అందుకున్నట్లు లెక్క. ఇంకా ఆగస్టులో అందుకోనున్న జులై నెలకు సంబంధించిన వేతనం పూర్తిగా పీఆర్సీకి అనుగుణంగా అందుకోనున్నారు ఉద్యోగులు. అయితే పెన్షనర్లకు మాత్రం గత నెలలోనే కొత్త పీఆర్సీకి అనుగుణంగా పెన్షన్లు ఇచ్చారు.
    Telangana Govt Jobs: తెలంగాణలో ఆ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన సర్కార్.. ఖాళీల వివరాలివే..

    అయితే.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి సైతం ఆగస్టులో పెరిగిన వేతనాలు చెల్లించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ఇప్పటి వరకు నెలకు మూడు వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యేదని అధికారులు చెబుతున్నారు. కానీ, పెరిగిన జీతాల చెల్లింపుతో ఇప్పుడు నెలకు నాలుగు వేల కోట్ల రూపాయలు అవుతోందని అధికారులు చెబుతున్నారు.

    ఇదిలా ఉంటే.. నిరుద్యోగులు, ఉద్యోగుల్లో తమపై అసంతృప్తి ఉందని భావించిన సీఎం కేసీఆర్ సర్కార్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పెండింగ్ లో ఉన్న పీఆర్సీ సమస్యను పరిష్కరించేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన వెంటనే చర్యలు ప్రారంభించింది. కరోనా సెకండ్ వేవ్ తో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వారికి పీఆర్సీ ప్రకటించింది. ఇంకా భారీగా ఉద్యోగాల భర్తీకి చర్యలు ప్రారంభించింది. 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సైతం ప్రణాళికలు రూపొందిస్తోంది.

    ఇంకా.. 2014 ఎన్నికల్లో ప్రధాన హామీ అయిన దళితులకు మూడెకరాల భూమి హామీ సైతం అటకెక్కిందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆ మచ్చను కూడా తొలగించుకోవడానికి సిద్ధమైంది. ఇందుకోసం దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి అమలుకు ఏర్పాట్లు చేస్తోంది. మళ్లీ ఎన్నికల నాటికి తమపై ఆయా వర్గాల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టుకుని మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published: