తెలంగాణలోని విద్యారంగ (Education)పై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ భేటీలో కేబినెట్ దీనిపై సుధీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియం లో విద్యాబోధన చేపట్టాలని అందుకోసం కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీషు మీడియం (English medium)లో బోధన కోసం టీచర్లకు తర్ఫీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీయంగా విద్యాలయాల పరిసరాలను తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే విధంగా క్రీడామైదానాలు తదితర వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, వారికి మధ్యాహ్న భోజన వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు కార్యాచరణ చేపట్టాలని కేబినెట్ (cabinet) నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్ నిర్ణయించింది. కాగా, ఆంగ్ల మాధ్యమం గురించి తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Telangana Education Minister Sabita Indrareddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం (2022-23)లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకేసారి ఆంగ్ల మాధ్యమాన్ని (English medium to all the classes at a time) ప్రారంభిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మొదటి తరగతి నుంచి ప్రారంభించుకుంటూ వెళ్లాలంటే పదో తరగతికి వచ్చేసరికి పదేళ్లు పడుతుందని మంత్రి వ్యాఖ్యానించారు. తన కార్యాలయంలో మంత్రి సబితా విలేకర్లతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే ఆంగ్ల మాధ్యమంలో చదువుకుంటున్నారని చెప్పారు. వచ్చే ఏడాది అన్ని బడుల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించిందని, అయితే తెలుగు మీడియం (Telugu medium) ఆప్షన్ కూడా ఉంటుందని చెప్పారు. ఎవరికి ఆసక్తి ఉన్న మాధ్యమంలో వారు చదువుకోవచ్చన్నారు.
రెండు భాషల్లో పుస్తకాలు..
పాఠ్య పుస్తకాలను రెండు భాషల్లో (Two languages) ముద్రిస్తామన్నారు మంత్రి. ఒకవైపు తెలుగు, మరోపుటలో ఆంగ్ల మాధ్యమంలో పుటలు ఉండేలా విద్యాశాఖ మంత్రి చూస్తామన్నారు. వర్సిటీల్లో ఆచార్యుల ఖాళీలపై కూడా త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుందని మంత్రి సబిత అన్నారు. నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు రెండు విధానాలను విద్యాశాఖ సూచించిందని అన్నారు. గతంలో మాదిరిగా వర్సిటీల వారీగా చేసుకోవడం, మరొకటి ఉమ్మడిగా ఓ బోర్డు చేపట్టడం. ఏ విధానంలో చేయాలన్నది సీఎస్ అధ్యయనం చేసి నిర్ణయిస్తారని మంత్రి తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుముల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ ఉండగా...మళ్లీ చట్టం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారని, కమిటీ కూడా పలు సిఫారసులు చేసి న్యాయపరమైన సమస్యలు లేకుండా చట్టం చేయాలని సూచించిందని, వాటినీ దృష్టిలో పెట్టుకుని చట్టం తీసుకురాబోతున్నామంటూ మంత్రి వెల్లడించారు.
మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సీఎంకు మంత్రి సబిత కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. " రాష్ట్రంలో మొత్తం 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. ఇప్పటికే వారిలో అనేక మంది ఆంగ్లంలో బోధిస్తున్నారు. ఒకేసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయడంపై సమస్యలేమీ ఉండవు. ఎందుకంటే ఇప్పటికే వేలాది బడుల్లో రెండు మాధ్యమాల్లో బోధన కొనసాగుతోంది. గతంలో ఆంగ్ల మాధ్యమంలో చేరిన విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఆంగ్ల భాషలో మెరుగయ్యారా? లేదా? అని తెలుసుకునేందుకు అధ్యయనం చేయిస్తాం" అన్నారు .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.