TELANGANA CM KCR TO ANNOUNCE PRC FOR GOVERNMENT EMPLOYEES AND INCREASE IN RETIREMENT AGE LIMIT IN ASSEMBY SK
Telangana: ఉద్యోగులపై వరాల జల్లు.. నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..?
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు వేతనాల పెంపు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఐతే ఇవాళే ఉద్యోగులకు శుభవార్తే అందే అవకాశముంది. పీఆర్సీతో పాటు పదవీ విరమణ వయసు పెంపుకు సంబంధించి.. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశముంది. సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఉద్యోగులంతా ఎదురు చూస్తున్నారు. ఇక పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలు ఏవీ చేయకూడదు. ఈ క్రమంలోనే పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది.
ఈసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. అయితే పీఆర్సీపై అనవసర ప్రచారం చేయరాదని ఈసీ సూచించింది. ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ ఆదివారం లేఖ రాశారు.
సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇటీవల జరిగిన రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి(ఐఆర్) కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.
29 శాతం ఫిట్మెంట్ లేదా అంత కన్నా ఎక్కువగానే ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఆయా ఈ అంశాలపై సీఎం నుంచి రానున్న అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.