TELANGANA CM KCR MAY ANNOUNCE 29 PER CENT FITMENT TO TELANGANA GOVERNMENT EMPLOYEES AFTER MLC ELECTIONS NS
Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఫిట్మెంట్ ఎంతంటే..
సీఎం కేసీఆర్
తెలంగాణలో ఉద్యోగులకు వేతనాల పెంపుపై మరో సారి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. నిన్న సీఎం కేసీఆర్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైన సందర్భంగా సీఎం కేసీఆర్ ఫిట్మెంట్ పై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో గత కొంత కాలంగా ఉత్కంఠ రేపుతున్న పీఆర్సీ అంశం మరో సారి తెరమీదకు వచ్చింది. వాస్తవానికి గత కొన్ని రోజుల క్రితమే ప్రభుత్వం పీఆర్సీ ప్రకటనకు సిద్ధమైనా.. ఈ లోగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రకటనకు బ్రేక్ పడింది. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరో సారి పీఆర్సీపై చర్చ మొదలైంది. నిన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీఓ అధ్యక్షురాలు మమత, పీఆర్టీయూ నేతలు సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మెరుగైన ఫిట్మెంట్ తో పీఆర్సీని ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఏపీలో 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులకు అంతకంటే 2, 3 శాతం ఎక్కువగానే ఫిట్మెంట్ ఇవ్వడానికి సీఎం అన్నట్లు సమాచారం. దీంతో 29 శాతం మేర ఫిట్మెంట్ తో పీఆర్సీని అధికారికంగా ప్రకటిస్తారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
టీచర్లకు కూడా ఉద్యోగులతో పాటే..
టీచర్లకు పీఆర్సీ అమలు విషయంలో మీడియాలో ఇటీవల అనేక కథనాలు వచ్చాయి. వారికి వేతన పెంపు ఉండదన్న ప్రచారం కూడా సాగడంతో టీచర్లలో ఆందోళన వ్యక్తమైంది. అయితే సీఎం ఈ విషయంపై స్పష్టత ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. టీచర్లకు కూడా ఉద్యోగులతో పాటు పీఆర్సీని అమలు చేస్తామని సీఎం హమీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. దీంతో పాటు ఉద్యోగలు పదవీ విరమణ వయస్సుపై సైతం సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలోని ఉద్యోగులు ఫ్యామిలీ పెన్షన్ పై సైతం సీఎం స్పందించారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. సీపీఎస్ పరిధిలోని ఉద్యోగులు ఎవరైనా సర్వీసులో ఉన్న సమయంలో మరణిస్తే వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడానికి సీఎం కేసీఆర్ ఓకే చెప్పారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కోడ్ ముగిసిన అనంతరం ఈ అంశాలకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.