Home /News /jobs /

TELANGANA CM KCR KEY ORDERS TO OFFICIALS OVER RECRUITMENT OF 50000 GOVERNMENT JOBS NS

Telangana Government Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త.. 50 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ఆదేశాలు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాలతో పాటు పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీల భర్తీని కూడా చేపట్టాలన్నారు.

    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇక వేగంగా సాగనుంది. ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవల అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలన్నారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడే ఉద్యోగ ఖాళీలను గుర్తించి రెండవ దశలో భర్తీ చేయాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశం పై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

    ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేదన్నారు. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అన్నారు. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాల్లు ఖాళీల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగిందని తెలిపారు. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయన్నారు. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయని వివరించారు.

    వాటిని ముందుగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టిందని సీఎం వివరించారు. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: CM KCR, Government jobs, Telangana, Telangana government jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు