TELANGANA CM KCR ANNOUNCED RS 2000 PER MONTH FINANCIAL ASSISTANCE TO PRIVATE SCHOOL TEACHERS NS
Telangana: ప్రైవేటు స్కూల్ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. రూ. 2 వేల సాయంతో పాటు..
సీఎం కేసీఆర్
Telangana Private School Teachers: కరోనా దెబ్బకు పాఠశాలలు మూతబడడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లకు సీఎం కేసీఆర్(CM KCR) గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఆర్థిక సాయంతో పాటు బియ్యం కూడా అందించనున్నట్లు ప్రకటించారు.
విద్యాసంస్థలను మూసివేయడంతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు స్కూల్ టీచర్లకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. వారిని ఆదుకుంటామని ప్రకటించారు. రూ. 2 వేల ఆర్థిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. సర్కారు అందించే ఈ సాయం పొందడం కోసం ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు, ఇతర సిబ్బంది బ్యాంకు ఖాతా తదితర వివరాలతో జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు గాను విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాలని ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు లక్షా యాబై వేల మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి ప్రయోజనం కలగనుంది.
రేపు ఉదయం 11-30 గంటలకు బీఆర్కె భవన్ లో ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్పరెన్స్ లో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు విద్యాశాఖ డీఈవోలు పౌరసరఫరాల శాఖ డీఎస్ఓలు ఇతర సిబ్బంది పాల్గొంటారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధి విధానాలను, కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం ఆదేశాలు జారీ చేయనున్నారు.
ఇదిలా ఉంటే.. కరోనా ప్రారంభంలో అంటే గతేడాది మార్చిలో ప్రభుత్వం విద్యాసంస్థలను మూసి వేసింది. దీంతో అప్పటి నుంచి దాదాపు అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వారి వద్ద పని చేసే టీచర్లు, ఇతర సిబ్బందికి వేతనాలు ఇవ్వడం ఆపేశాయి. కొన్ని విద్యాసంస్థలు సగం వేతనాలు ఇవ్వగా.. మరి కొన్ని సంస్థలు భారీగా కోతలు విధించాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే టీచర్లు సిబ్బంది రోడ్డు పడ్డారు. ఇన్నాళ్లు విద్యార్థులకు పాఠాలు బోధించి ఆత్మగౌరవంతో పని చేసిన ఉపాధ్యాయులు కొందరు కూలి పనులకు కూడా వెళ్తున్న వార్తలు మీడియాలో వచ్చాయి. అనేక మంది మనస్సు చంపుకుని హోటళ్లు నడుపుతూ, కూరగాయలు అమ్మడం కూడా చేసిన ఘటనలు ఉన్నాయి.
ఇటీవల పాఠశాలలను ప్రభుత్వం తిరిగి నడపేందుకు ప్రభుత్వం అనుమతించడంతో ఆయా ప్రైవేటు పాఠశాలల సిబ్బందిలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే కొన్ని రోజుల్లోనే కరోనా విజృంభిస్తుండడంతో మళ్లీ వాటిని తిరిగి మూసివేయడంతో అనేక మంది మళ్లీ రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ కు చెందిన ప్రైవేటు స్కూల్ టీచర్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అనేక మందికి కన్నీరు పెట్టించింది. దీంతో ప్రభుత్వం కూడా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.