రెండు లక్షలకు పైగా అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గ్రూప్-1 ప్రిలిమ్స్ (TSPSC Group 1 Prelims) ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ప్రిలిమ్స్ ఫలితాల విషయంలో ఏర్పడిన న్యాయపరమైన అడ్డంకులు తొలిగిపోయాయన్నారు. త్వరలోనే ఈ ఫలితాలను (TSPSC Group1 Results) విడుదల చేయనున్నట్లు చెప్పారు. మెయిన్స్ ఎగ్జామ్ కు మొత్తం 25 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ సర్వీసెస్ (OU Civil Services Academy) అకాడమీని బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఎదగాలని ఆకాంక్షించారు. యూనివర్శిటీలు విద్యార్థులకు పోటీపరీక్షల తర్ఫీదు ఇచ్చే విధంగా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైస్ ఛాన్సలర్ల సమావేశంలో తాను చేసిన ప్రతిపాదనను... ఉస్మానియా యూనివర్శిటీ సాకారం చేసిందని హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కళలను నిజం చేసేలా చొరవ తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ ను ఈ సందర్భంగా సోమేష్ కుమార్ అభినందించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నోటిఫికేషన్ దశలో ఉందన్నారు. గతంలో ఒక రాష్ట్రం వ్యక్తులు మరో రాష్ట్రంలో ఉద్యోగాలకు ఎంపిక అయ్యేవారన్నారు. అయితే.. తెలంగాణలో ఇక ఆపరిస్థితి ఉండదన్నారు. ఇక్కడి యువతకు ఆ భయం లేకుండా ప్రభుత్వం ముందు చూపుతో రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకువచ్చి 95 శాతం కొలువులు ఇక్కడి స్థానిక యువతకే దక్కేలా చర్యలు చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే ఇది సాధ్యమైందని సీఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారులు బుర్రా వెంకటేశం, నవీన్ మిత్తల్, వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
Telangana Jobs: నిరుద్యోగులకు అలర్ట్.. వారంలో మరో 4 వేలకు పైగా ఖాళీలకు నోటిఫికేషన్.. వివరాలివే
ఇదిలా ఉంటే.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ ను మొత్తం 502 ఖాళీలతో టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. నియామక ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనుంది టీఎస్పీఎస్సీ. వీరంతా గత నెల రోజులుగా ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Group 1, JOBS, Osmania University, Telangana government jobs, TSPSC