Navy Officer: అనుకుంటే ఏదైనా సాధ్యమే.. నేవీలో పనిచేస్తూ IIM సీటు సాధించిన యువకుడు

ధనంజయ్ ప్రసాద్

Success Story: 12 ఏళ్ల పాటు ఇండియన్​ నేవీలో సేవలందించిన 34 ఏళ్ల ధనంజయ్​కి ఇటీవల అమెజాన్​ ఐటీ సెల్​లో రూ.లక్షలు వచ్చే మరో ఉద్యోగం రాగా.. దాన్ని కూడా వదులుకొని, ఎంబీఏ​ వైపు అడుగులు వేశారు. నేవీలో ఉద్యోగం చేస్తూనే ఐఐఎం కోల్​కతాలో ఎంబీఏ సీటు సాధించారు.

  • Share this:
నేటి తరం యువత వారి అభిరుచికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే లక్షల్లో జీతాలను సైతం వదులుకొని తమ ప్యాషన్​ వైపు అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో ఇండియన్​ నేవీలో టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేసిన ధనంజయ్ కుమార్ ప్రసాద్‌ కూడా ఒకరు. 12 ఏళ్ల పాటు ఇండియన్​ నేవీలో సేవలందించిన 34 ఏళ్ల ధనంజయ్​కి ఇటీవల అమెజాన్​ ఐటీ సెల్​లో రూ.లక్షలు వచ్చే మరో ఉద్యోగం రాగా.. దాన్ని కూడా వదులుకొని, ఎంబీఏ​ వైపు అడుగులు వేశారు. నేవీలో ఉద్యోగం చేస్తూనే ఐఐఎం కోల్​కతాలో ఎంబీఏ సీటు సాధించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.

తన సక్సెస్​పై ధనంజయ్​ మాట్లాడుతూ ‘‘అమెజాన్ ఐటీ ఆపరేషన్స్​లో ఇటీవల నాకు ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగం ఎంతో మందికి కల. అయినప్పటికీ,​ ఆ ఉద్యోగాన్ని కాదని ఎంబీఏ పూర్తి చేయడమే నా మొదటి ప్రాధాన్యతగా భావించాను. దానికి తగ్గట్లు జీమ్యాట్​ ప్రిపరేషన్​ కొనసాగించి, ఐఐఎం కోల్​కతాలో ఎంబీఏ సీటు సాధించాను’’ అని చెప్పారు. కాగా, ధనంజయ్​ ఇప్పుడు ఐఐఎం కోల్​కతాలో ఎంబీఎక్స్ ప్రోగ్రాంను అభ్యసిస్తున్నారు. ఆయన 2019లో భోపాల్​లోని డిఫెన్స్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్​లో ఉద్యోగం చేస్తుండగానే జీమ్యాట్​ ప్రిపరేషన్​ ప్రారంభించారు. అయితే ఉద్యోగం చేస్తూ ప్రిపరేషన్​ కొనసాగించడం కాస్త ఇబ్బందిగా మారింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో ఓవైపు ఉద్యోగం, మరోవైపు ప్రిపరేషన్​ కొనసాగించారు.

అమెజాన్​ ఆఫర్​ వదులుకొని..
తన ప్రిపరేషన్​ స్ట్రాటజీపై ధనంజయ్​ మాట్లాడుతూ “నేను ఉద్యోగం చేస్తున్న భోపాల్ దగ్గర్లో ఎటువంటి కోచింగ్​ సెంటర్లు లేవు. అందువల్ల, ప్రిపరేషన్​ గైడ్​లైన్స్​ కోసం ఆన్‌లైన్‌ లెర్నింగ్​ ప్లాట్​ఫామ్​నే ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూ ప్రిపరేషన్​ కోసం యూట్యూబ్, జీమ్యాట్ క్లబ్​ గ్రూప్​ను అనుసరించాను. ప్రతి రోజూ నా విధులు పూర్తయ్యాక​ 4 నుంచి 5 గంటల పాటు ప్రిపరేషన్​ కోసం సమయం కేటాయించేవాన్ని. ఎట్టకేలకు జీమ్యాట్​లో మంచి స్కోర్​ సాధించి వివిధ ఐఐఎంలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నాను. అయితే. నాకు రెండు ఐఐఎంలలో అడ్మిషన్​ లభించింది. కానీ, ఐఐఎం కోల్​కతాను ఎంచుకున్నాను" అని తెలిపారు.

ధనంజయ్​ ప్రసాద్​ బీహార్​లోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి భారత సైన్యంలో సైనికుడిగా పనిచేశారు. ప్రసాద్​ జబల్‌పూర్‌ కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఇండియన్​ నేవీలో టెక్నికల్​ ఆఫీసర్​గా ఉద్యోగం సాధించారు. టెక్నికల్ ఆఫీసర్​గా ఆయుధాలు, సెన్సార్లు, డివైజ్, నెట్‌వర్క్, ప్రాజెక్ట్ నిర్వహణ బాధ్యతలు చూసుకునే వారు. నేవీలో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ఇంజనీర్ల బృందానికి నాయకత్వం వహించారు.
Published by:Shiva Kumar Addula
First published: