Study Abroad : ఇప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత చాలా మంది ఉన్నత చదువుల(Higher education) కోసం విదేశాలకు(Abroad) వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి స్కిల్స్, క్రెడెన్షియల్స్ సాధించేందుకు అదే సరైన పద్ధతని భావిస్తున్నారు. అందుకే గతంతో పోలిస్తే ఇప్పుడు అబ్రాడ్ వెళ్లి చదువుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరి అక్కడ మనకు తెలియని చోట్ల సరైన యూనివర్సిటీని ఎలా ఎంపిక చేసుకోవాలి? టాప్ ర్యాంకింగ్ ఉంటే చాలా? లేకపోతే ఎలాంటి కాలేజీలకు అప్లికేషన్లు పెట్టుకోవడం మంచిది? లాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు అందించారు ఎడ్యూటెక్ పోర్టల్ గ్రాడ్‌రైట్ సహ వ్యవస్థాపకులు ఆయుష్ నాగ్‌పాల్, శశిధర్ సిస్టా. ఆ వివరాలు..
ఏఐ సహాయం మంచిదేనా?
కొందరు విద్యార్థులు కెరీర్ ప్లానింగ్, వర్సిటీ సెలక్షన్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI)ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫాంలపై ఆధారపడుతుంటారు. ఇక్కడ విద్యార్థుల డేటాను ఏఐ పరిశీలిస్తుంది. ప్రొఫైల్స్, ప్రొఫెషనల్ గోల్స్, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్‌లో ఏమి అవ్వాలనుకుంటున్నారు? లాంటి అన్నింటినీ బేరీజు వేస్తుంది. వారి అవసరాలకు సరిపోయే కోర్సులు , ప్రోగ్రామ్‌లు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. వాటిలోని మంచి యూనివర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. తద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే అల్గారిథమిక్ మ్యాచ్‌మేకింగ్. దీనితో విద్యార్థులు నేరుగా వారికి నచ్చిన కళాశాలలతో కనెక్ట్ కావచ్చు.
కౌన్సిలర్లు బెటరా?
చాలా మంది అబ్రాడ్ (Abroad Study) వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు తమకున్న సందేహాలు తీర్చుకోడానికి కౌన్సిలర్లపై ఆధారపడతారు. పెద్ద నగరాలలో అయితే కౌన్సిలర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. వారు అందించే సేవలకు రూ.లక్షల్లో వసూలు చేస్తుంటారు. వారికొచ్చే కమిషన్లను లాభాలను దృష్టిలో ఉంచుకుని వారు విద్యార్థులకు గైడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కానీ చిన్న నగరాలు, పట్టణాలలో వీరు చాలా చోట్ల అందుబాటులో ఉండరు. దీంతో చాలా మంది కుటుంబం, స్నేహితులు, బ్యాచ్ మేట్లు ఇచ్చే సలహాలను తీసుకుని ముందుకు వెళతారు. అయితే ఇవి అన్నిసార్లూ సరిగ్గా ఉండవు. అందువల్ల విద్యార్థుల ఖర్చుకు ఫలితం రాకపోవచ్చు.
మిడిల్ మ్యాన్ ఉండొచ్చా?
మన భవిష్యత్తును మిడిల్ మ్యాన్ చేతుల్లో పెట్టడం అంత మంచిది కాదు. కొన్నిసార్లు ఆ దేశానికి, యూనివర్సిటీలకు ఏ మాత్రం సంబంధంలేని మిడిల్ మ్యాన్లు కౌన్సిలర్లుగా వ్యవహరిస్తుంటారు. వారితో మాట్లాడటం కంటే మీరు చేరాలనుకుంటున్న కళాశాలలో అప్పటికే చదువుకుంటున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. మనం సరైన ఎంపిక చేసుకుంటున్నామో లేదో తెలుసుకోవడానికి ఇదో నమ్మదగిన ప్రయత్నం అవుతుంది.
విద్యార్థులు తమ అవసరాలకు అన్ని విధాలా సరిపోయిన యూనివర్సిటీలను, కాలేజీలను ముందు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఇలా షార్ట్ లిస్ట్ అయిన వాటిలో ఏవి బ్యాంక్ నుంచి ఫండబుల్గా ఉన్నాయో గుర్తించాలి. అలాంటి వాటి వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ఎలాంటి ఒత్తిడి లేకుండా మీరు మీ చదువును పూర్తి చేయగలుగుతారు. విద్యార్థి అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని పనిచేసే డిజిటల్ ప్లాట్‌ఫాంల సాయం తీసుకుని నిర్ణయించుకోవడం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.