భారత్‌లో విదేశీ విద్యాసంస్థల ఏర్పాటుకు ముందడుగు పడిన నేపథ్యంలో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని విదేశీ విద్యాసంస్థలను ఆహ్వానించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) సిద్ధమైంది. ఈ మేరకు జనవరి 5న డ్రాఫ్టుని విడుదల చేయగా.. తుది నోటిఫికేషన్‌ని నెలాఖరు వరకు ప్రకటించనుంది. దీంతో యూజీసీ నిర్ణయాన్ని విద్యార్థులు స్వాగతిస్తున్నారు. చదువుకోవాలన్న ఆసక్తి ఉండి.. ఆర్థిక స్థోమత లేని ఎంతోమంది విద్యార్థులకు ఈ నిర్ణయం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం పెద్దగా తేడా ఏమీ ఉండబోదని చెబుతున్నారు. విద్యార్థుల అభిప్రాయాలు ఇలా..
నాణ్యమైన విద్య లభిస్తుంది
అధునాతనమైన విదేశీ విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులకు సౌలభ్యం కలగడం సంతోషకరమని 25 ఏళ్ల సిద్దాంత్ గుప్తా వెల్లడించారు. బ్రిటన్ యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సిద్ధాంత్ గుప్తా.. ఆన్‌లైన్ ద్వారా కోర్సును అభ్యసిస్తున్నారు. విదేశీ యూనివర్సిటీలు నాణ్యమైన విద్యను అందిస్తాయని సిద్ధాంత్ చెప్పారు. ఇండియాలో ఇవి ఏర్పాటైతే విద్యార్థులకు మరింతగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
* ఖర్చు తగ్గుతుంది
విదేశీ యూనివర్సిటీలు భారత్‌లో ఏర్పడితే విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని విద్యార్థిని కృతిమ భప్తా అభిప్రాయపడ్డారు. విదేశాలతో పోల్చితే
భారత్‌లో విద్యకు అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని భప్తా చెప్పారు. ఆమె సింగపూర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. బ్రిటన్‌లో పీహెచ్‌డీ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆమె మాట్లాడుతూ..‘విదేశీ విశ్వవిద్యాలయాలు ఇండియాకి రావడం ఎంతో ప్రయోజనకరం. ముఖ్యంగా విద్యార్థులకు ఖర్చు తగ్గుతుంది. అదే అమెరికా, బ్రిటన్‌లలో అయితే ఖర్చును భరించలేం. సాధారణంగా ధరలు ఎక్కువగా ఉంటాయి. మంచి సత్తా ఉన్న విద్యార్థులు ఆర్థిక కారణాల వల్ల విదేశీ విద్యను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా బీద, మధ్య తరగతి కుంటుంబం నుంచి వచ్చే విద్యార్థులు చదువు ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మన దేశానికి వస్తే మాత్రం ఇలాంటి వారికి మేలు జరుగుతుంది.’ అని చెప్పారు.
* ఇండియాకు వస్తాయా?
యూజీసీ నోటిఫికేషన్‌ని విద్యార్థిని సుమతి భాటి(21) స్వాగతించారు. కాకపోతే ఉన్నఫలంగా విదేశీ విద్యాసంస్థలు భారత్‌కు రాగలవా అని సంశయం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని అనుకుంటున్నానని, ఈ సమయంలో యూజీసీ నోటిఫికేషన్ ఎంతో ఊరటనిచ్చిందని చెప్పారు. అయితే, విదేశీ విద్యా సంస్థలు ఇప్పటికిప్పుడు ఇండియాకు వస్తాయా? అందులోనూ భారత్‌కు రావడానికి ఎలాంటి యూనివర్సిటీలు ఆసక్తి చూపుతాయా? అనే సందేహాన్ని వ్యక్తం చేశారు.
* పెద్ద ప్రయోజాలు ఉండవు
విదేశీ విద్యాసంస్థలు భారత్‌కు రావడం వల్ల మరీ ఎక్కువగా ప్రయోజనం ఏమీ ఉండబోదని మరికొంత మంది విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. విదేశీ విద్యాసంస్థలను ఆహ్వానించడం కన్నా.. భారత్‌లోనే విద్యా ప్రమాణాలను మెరుగు పరచాలని సూచిస్తున్నారు. తమ సోదరుడు కెనడాలో చదవడానికి ముఖ్యం కారణం ఇదేనని గౌర్‌దీప్ కౌర్ చెప్పారు. భారత్‌లోని యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలన్నారు. విదేశీ యూనివర్సిటీలతో పోటీ పడే స్థాయిలో మన విద్యాసంస్థల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోదరుడి విద్య కోసం రూ.20 లక్షల లోన్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడే బాగుంటే విదేశాలకు వెళ్లే వాడు కాదు కదా? అని ప్రశ్నించారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిసన్ విదేశీ విద్యాసంస్థల ఏర్పాటుపై ముసాయిదాను రూపొందించింది. ఇందులో కొన్ని షరతులను విధించింది. కచ్చితంగా అందుబాటు ధరల్లోనే ఫీజులు ఉండాలని, పారదర్శకంగా కార్యకలపాలను కొనసాగించాలని చెప్పింది. నోటిఫికేషన్ నిబంధనలను అనుసరించిన వాటికే యూజీసీ అనుమతి ఇవ్వనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Online Education