చాలా మందికి విదేశాలకు వెళ్లి చదువుకోవాలని ఉంటుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వలసలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. అంతర్జాతీయ విద్యకు ప్రాధాన్యం ఉండటం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు(Jobs) లభిస్తుండడం తో ఎక్కువ మంది విదేశాల్లో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, కరోనా మహమ్మారి కారణంగా కొంత కాలం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది. అయితే ఇప్పుడు ఆ సంఖ్య మునుపటి కంటే వేగంగా పెరుగుతోంది. 2023లో అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తూ, ఇమిగ్రేషన్‌కు(Immigration) అనుకూలంగా ఉన్న 7 దేశాల గురించి తెలుసుకుందాం.
* జర్మనీ
తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య పొందాలనుకునే అంతర్జాతీయ విద్యార్థులకు జర్మనీ బెస్ట్ ఛాయిస్. జర్మన్ ప్రభుత్వం వ్యాపారం, విద్య, ఉపాధి అవకాశాలను కోరుకునే ప్రజలను ఆకర్షించడానికి వలసలను ప్రోత్సహిస్తుంది. ఈ వీసా హోల్డర్లు నివాస అనుమతిని (తాత్కాలిక లేదా శాశ్వత) త్వరగా పొందుతారు. ఇది జర్మనీలో శాశ్వత నివాసానికి వీలు కల్పిస్తుంది.
* ఫ్రాన్స్
సాంకేతిక రంగాన్ని ప్రోత్సహించడానికి, టెక్ నిపుణులకు శాశ్వత నివాస హోదా కల్పించడానికి ఫ్రెంచ్ ప్రభుత్వం 2017లో ప్రత్యేక వర్క్ వీసాను ప్రవేశపెట్టింది. ఫ్రెంచ్ టెక్ వీసా యూరోప్‌లోని సుదీర్ఘ కాల వీసా ప్రత్యామ్నాయాలలో ఒకటి. టెక్ ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు నాలుగు సంవత్సరాలు ఫ్రాన్స్‌లో నివసించడానికి, పని చేయడానికి ఈ వీసా వీలు కల్పిస్తుంది.
* ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దేశం కూడా వలసలను ప్రోత్సహిస్తోంది. శాశ్వత హోదా కావాలనుకునే విదేశీలకు ఇమిగ్రేషన్ నిబంధనలను సడలించింది. మంచి జీవన ప్రమాణాలు, అద్భుతమైన ఉపాధి అవకాశాలకు వారధిగా నిలుస్తోంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఆస్ట్రేలియా బెస్ట్ ఛాయిస్. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అద్భుతమైన బీచ్‌లు విదేశీయులను బాగా ఆకట్టుకుంటాయి.
* న్యూజిలాండ్
సుందరమైన దేశంగా పేరొందిన న్యూజిలాండ్‌లో స్థిరపడాలని అనేక మంది కలలు కంటారు. అటువంటి వారిని న్యూజిలాండ్ దేశం ఆకర్షిస్తోంది. న్యూజిలాండ్ యూరప్ కంటే మెరుగైన జీతాలు, పని అవకాశాలను అందిస్తుంది. ఇక్కడ నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఉన్నందున పని చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వలస వస్తుంటారు.
* యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA)
ప్రపంచంలో ఎక్కువ మంది విద్యార్థులను, ఉద్యోగులను ఆకర్షిస్తున్న దేశం అమెరికా. అందుకే, USA గ్లోబల్ లీడర్‌గా ఉద్భవించింది. ఇతర దేశాల నుంచి గణనీయమైన సంఖ్యలో ప్రజలు అమెరికాలో చదువుకోవడానికి, పని చేయడానికి వస్తుంటారు. జాతీయంగా అత్యధిక ఉద్యోగాలను సృష్టించే దేశంగా, విద్యార్థులకు, నిపుణులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతర్జాతీయ నివాసితులు తమ కుటుంబ సభ్యులతో కలిసి యూఎస్‌లో పని చేయడానికి, నివసించడానికి అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ విద్యార్థులు యూఎస్‌లో అధిక జీవన వ్యయం ఉన్నప్పటికీ హాయిగా జీవించగలరు.
* యునైటెడ్ కింగ్డమ్
ప్రపంచంలోనే అతిపెద్ద కార్మిక మార్కెట్ యునైటెడ్ కింగ్డమ్లో ఉంది. అధిక ఆదాయాలు, పరిశోధన -ఆధారిత విద్యా విధానం కారణంగా, విదేశాల నుండి వలస వచ్చే వారికి యూకే ఒక ప్రసిద్ధ గమ్యస్థానంగా మారింది. UK అంతర్జాతీయ అభ్యర్థులను అక్కడ పని చేయడానికి, చదువుకోవడానికి స్వాగతిస్తోంది.
* కెనడా
ఐక్యరాజ్యసమితి ప్రకారం, కెనడా అత్యధిక జీవన నాణ్యత ప్రమాణాలను కలిగి ఉంది. అందుకే వలసదారులకు అత్యంత ఆకర్షణీయ దేశంగా నిలిచింది. కెనడా ప్రభుత్వం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే వారి కోసం ఇమిగ్రేషన్ విధానాలను సడలించింది. సౌకర్యవంతమైన, సురక్షితమైన జీవనంతో పాటు నాణ్యమైన విద్యకు కెనడా పెట్టింది పేరు. ఇక్కడి వర్సిటీల్లో అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కోర్సులను పూర్తి చేసిన వారు వేగంగా శాశ్వత నివాసం (PR) పొందవచ్చు. అంతేకాకుండా, కెనడాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు లభిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Canada, Career and Courses, JOBS