news18-telugu
Updated: November 1, 2020, 3:58 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కరోనా వైరస్ కారణంగా ఏడు నెలలుగా స్కూళ్లు మూతపడ్డాయి. సాధారణ పరీక్షలతో పాటు బోర్డు ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. చివరకు పదో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గడంతో పాటు రికవరీల సంఖ్య పెరగడంతో.. కేంద్రం ఎన్నో సడలింపులు ఇచ్చింది. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నవంబరు 2 నుంచి స్కూళ్లు తెరిచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. ఏపీలోనూ సోమవారం నుంచి పాఠశాలలు తెరచుకోనున్నాయి. ఇలాంటి తరుణంలో స్కూళ్ల పున: ప్రారంభం గురించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతోంది. నవంబరు 30 వరకు స్కూళ్లను తెరవద్దని కేంద్రం ఆదేశాలు జారీచేసినట్లు ఓ సందేశం వైరల్ అవుతోంది.
''విపత్తు నిర్వహణ చట్టం-2005 సెక్షన్ 10 (2)(1) ప్రకారం కరోనా మహమ్మారికి సంబంధించి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. నవంబరు 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలను మూసివేయాలని అందులో పేర్కొంది.'' అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఐతే ఈ ప్రచారంపై PIB Fact Check స్పందించింది. ఇది ఫేక్ న్యూస్ అని.. ఇందులో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. స్కూళ్లను తెరవాలా? లేదా? అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసినట్లు వెల్లడించింది.
కాగా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే. 2019, డిసెంబరులో ఈ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన బ్యూరో ప్రారంభించింది. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి, ప్రజలకు నిజాలను చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం.
మనదేశంలో నిన్న కొత్తగా 46,963 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 81,84,082కి చేరింది. నిన్న దేశంలో 470 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,22,111కి చేరింది. దేశంలో మరణాల రేటు మార్పు లేకుండా... 1.5 శాతంగానే ఉంది. ప్రపంచ దేశాలలో అది 2.59 శాతంగా ఉంది. ఇండియాలో కొత్తగా 58,684 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 74,91,513కి చేరింది. ఇండియాలో రికవరీ రేటు మరింత పెరిగి 91.5 శాతానికి చేరింది. ఇదో మంచి పరిణామం. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 5,70,458 ఉన్నాయి. ఇండియాలో నిన్న కొత్తగా 10,91,239 టెస్టులు చేశారు. మొన్నటి కంటే అవి 23,263 ఎక్కువ. మొత్తం టెస్టుల సంఖ్య 10కోట్ల 98 లక్షల 87 వేల 303కి చేరింది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 1, 2020, 3:54 PM IST