news18-telugu
Updated: August 26, 2020, 10:31 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల చర్చ జరుగుతోంది. జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు తెరిచేందుకు ఆయా రాష్ట్రాలు సమాలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఆన్ లైన్ క్లాసుల మీద ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో పొరుగున ఉన్న ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశాలో దసరా నవరాత్రుల వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవకూడదని నిర్ణయించింది. ఈ మేరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దసరా వరకు స్కూళ్లు, కాలేజీలు తెరవొద్దని స్పష్టం చేశారు. కరోనా వల్ల దేశవ్యాప్తంగా మార్చి 17 నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.
మరోవైపు రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, స్వయం సహాయక సంఘాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని, తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సొంత రాష్ట్రానికి వచ్చేసిన వలస కార్మికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలన్నారు. వారికి రుణ సదుపాయాలు కల్పించాలని చెప్పారు. చిన్న, చిన్న వ్యాపారాలు పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలని చెప్పారు. రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. అక్టోబర్ 17న దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 25న విజయదశమి. అంటే అక్టోబర్ 25 వరకు ఒడిశాలో స్కూళ్లు, కాలేజీలు తెరిచే అవకాశం లేదు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 26, 2020, 10:30 PM IST