కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాఠశాలలను మూసివేశారు. గత ఏడాది మార్చి నుంచి స్కూళ్లు తెరచుకోలేదు. ఆన్లైన్ బోధన కొనసాగినప్పటికీ, ఎంతోమంది విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. దీనికి తోడు మహమ్మారి వల్ల ఎన్నో కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. దీంతో స్కూల్ ఫీజులు చెల్లించలేక చాలామంది విద్యార్థులు పాఠశాలల్లో అడ్మిషన్ కూడా తీసుకోలేదు. ఇలాంటి వారికి సాయం చేస్తున్నారు మహారాష్ట్రకు చెందిన ఒక స్కూల్ ప్రిన్సిపల్. విద్యార్థుల స్కూల్ ఫీజుల కోసం గత ఏడాది నుంచి నిధులు సేకరిస్తున్నారు ముంబైలోని పోవై ఇంగ్లీష్ హైస్కూల్ ప్రిన్సిపాల్ షిర్లే పిళ్లై. ఇప్పటి వరకు ఆమె రూ.40 లక్షలు సేకరించగలిగారు. దీని ద్వారా 200 మంది పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించారు.
Scholarships: రిసెర్చ్ కోసం మూడు అత్యుత్తమ స్కాలర్షిప్లు.. అర్హత, దరఖాస్తు వివరాలివే..
కరోనా తరువాత, తమ పాఠశాలలో చదువుతున్న 2,200 మంది విద్యార్థులలో దాదాపు 50 శాతం మంది ఫీజు చెల్లించడం మానేశారని షిర్లే పిళ్లై చెబుతున్నారు. వారి తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేమని చెప్పారు. పాఠశాల యాజమాన్యం కూడా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుంది. అయితే ఈ స్కూల్లో ఎక్కువ మంది మధ్యతరగతి వారు, కూలీలు, వలస కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే కుటుంబాల పిల్లలు, పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. వీరిలో చాలామంది చదువుకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ సంక్షోభంపై పాఠశాల యాజమాన్యం దృష్టి సారించింది.
పాఠశాలల స్కూల్ ఫీజు రూ.35,000 ఉండేది. దాన్ని ఈ సంవత్సరం సగానికి తగ్గించారు. ఆ మొత్తం కూడా చెల్లించలేని కుటుంబాల కోసం నిధులు సేకరించాలని నిర్ణయించారు పిళ్లై. ఇందుకు కార్పొరేట్ సంస్థలను, తెలిసిన వారిని, ప్రముఖులను సంప్రదించారు. వారు ఇచ్చినంత తీసుకుంటూ డబ్బు పోగు చేశారు. తన శక్తి మేరకు ప్రయత్నించి తగినన్ని నిధులను సేకరించగలిగారు. ఆ డబ్బుతో 2020-21 సంవత్సరంలో 200 మంది విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించారు.
కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాల్లో బాలికలు చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని గ్రహించారు షిర్లే. ఈ పరిస్థితి రాకుండా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. అయినా కూడా తన నిధుల సేకరణ కార్యక్రమాన్ని ఆపలేదు. 2021-22 సంవత్సరానికి కూడా విద్యార్థులకు స్కూల్ ఫీజులను చెల్లించేందుకు ఆమె ఏర్పాట్లు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి కూడా ఎక్కువ మంది పిల్లల ట్యూషన్ ఫీజులను చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు షిర్లే చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona help, Mumbai