ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సాంసంగ్ కొత్త కొత్త ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను పరిచయం చేయడంలోనే కాదు సామాజిక సేవలోనూ ముందుంటుంది. ప్రతిభ గల విద్యార్థులకు ప్రతి ఏటా సాంసంగ్ ‘స్మార్ట్ స్కాలర్ ప్రోగ్రాం’ పేరుతో స్కాలర్షిప్లు అందజేస్తుంది. విద్యార్థి ట్యూషన్ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, హాస్టల్ ఫీజు వంటి ఖర్చుల కోసం సంస్థ తన భాగంగా 2 లక్షల వరకు స్కాలర్షిప్ను అందిస్తుంది. ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు సాధించిన జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థుల కోసమే దీన్ని ప్రత్యేకంగా ప్రారంభించింది. ఇలా ఇప్పటివరకు 544 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసినట్లు సాంసంగ్ పేర్కొంది. 2020–21 ఏడాదికి గాను మొత్తం 150 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లను మంజూరు చేయగా.. అందులో 87 మంది ప్రతిష్టాత్మక ఐఐటిలలో, 63 మంది ఎన్ఐటిలలో ప్రవేశాలు సాధించిన వారున్నారు.
వీరితో పాటు ఇప్పటికే సాంసంగ్ స్కాలర్షిప్ పొందిన 394 మంది విద్యార్థులకు రెన్యువల్ చేసింది. వీరిలో 139 మంది ఇంజినీరింగ్ సెకండియర్, 171 మంది థర్డ్ ఇయర్, 82 ఫైనలియర్ విద్యార్థులున్నారని సాంసంగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సాంసంగ్ ఈ స్టార్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించి ఐదేళ్లు పూర్తై ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఇప్పటివరకు 800 మంది జవహర్ నవోదయ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేసింది.
‘‘స్టార్ స్కాలర్ ప్రోగ్రాం ప్రారంభించి ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. దేశాన్ని మార్చే భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దాలనే ఉద్దేశ్యంతో ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించాం. ప్రతిభగల విద్యార్థులకు చేయూతనిస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని సాంసంగ్ ఇండియా కార్పొరేట్ సిటిజన్షిప్ ఉపాధ్యక్షుడు పార్థా ఘోష్ అన్నారు.
కాగా, స్కాలర్షిప్ ఎంపిక ప్రక్రియను పరిశీలిస్తే.. మొదటి సంవత్సరం విద్యార్థులను జెఈఈ మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్ (ఎఐఆర్)ను బట్టి ఎంపిక చేస్తున్నారు. అయితే, మిగతా విద్యార్థులను మాత్రం కిందటి ఏడాది సాధించిన సెమిస్టర్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (ఎస్జిపిఎ) లేదా కుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సిపిజిఎ)ను బట్టి ఎంపిక చేస్తారు. 5 లేదా అంతకంటే రేటింగ్ వచ్చిన విద్యార్థులకే స్కాలర్షిప్ రెన్యువల్ చేస్తారు. సాంసంగ్ కేవలం స్కాలర్షిప్లే కాకుండా 80 జవహర్ స్కూల్స్లో 625 స్మార్ట్ క్లాసులను ఏర్పాటు చేసింది. తద్వారా 5 లక్షలకు పైగా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 8,000 మంది ఉపాధ్యాయులకు స్మార్ట్ క్లాసులపై శిక్షణనిచ్చింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.