ఇటీవల గ్లోబల్ కంపెనీలు వరుసగా ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్యం ప్రభావంతో చాలా కంపెనీలు వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ఈ క్రమంలో రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కంపెనీ శామ్సంగ్(Samsung) నుంచి ఓ ప్రకటన వెలువడింది. దక్షిణ కొరియాకు చెందిన ఈ సంస్థ ఇండియాలో ఇంజినీర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించింది. దాదాపుగా వెయ్యి మంది ఇంజినీర్లను నియమించుకుంటామని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న తమ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో వీరు పని చేయాల్సి ఉంటుందని చెప్పింది. 2023 నుంచి కంపెనీలో పని చెయ్యడం ప్రారంభిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఏ విభాగంలో పని చేయాలి?
ఈ 1000 మంది ఇంజినీర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్(ML), డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) విభాగాల్లో పని చేయాల్సి ఉంటుందని తెలిపింది. అదే విధంగా కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రెడిక్టివ్ అనాలసిస్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, సిస్టమ్ ఆన్ చిప్(SoC), స్టోరేజ్ సొల్యూషన్లు వంటి లేటెస్ట్ టెక్నాలజీలపై వర్క్ చేయాలని కంపెనీ తెలియజేసింది.
అర్హతలు ఇవే
ఈ జాబ్స్‌కి కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ కోర్సులు (AI, ML, కంప్యూటర్ విజన్, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్ స్ట్రీమ్‌ల నుంచి ఇంజినీర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటామని శామ్సంగ్ తెలిపింది. వీటితోపాటు మ్యాథమెటిక్స్, కంప్యూటింగ్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ల నుంచి కూడా నియామకాలు జరగనున్నాయని పేర్కొంది.
ఎక్కడ పని చేయాలి?
భారతదేశ వ్యాప్తంగా శామ్సంగ్ కు కొన్ని ఆర్ అండ్ డీ(Research and development) ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. బెంగుళూరు, నోయిడా, ఢిల్లీల్లోని వీరి ఇన్స్టిట్యూట్లలో ఈ ఉద్యోగులు రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ విభాగంలో పని చేయాల్సి ఉంటుంది.
ఐఐటీలకు ప్రాధాన్యం
శామ్సంగ్ ఇప్పటికే IITలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులకు 400 ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లను(PPO) అందించింది. మరో 200 మంది ఇంజినీర్లను ఐఐటీ- మద్రాస్, ఐఐటీ- ఢిల్లీ , ఐఐటీ- హైదరాబాద్ , ఐఐటీ- బాంబే, ఐఐటీ- రూర్కీ, ఐఐటీ- ఖరగ్‌పూర్, ఐఐటీ- కాన్పూర్, ఐఐటీ- గౌహతి, ఐఐటీ- బీహెచ్‌యూల నుంచి నియమించుకోనున్నారు.
ఈ విషయంపై శామ్సంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ మాట్లాడారు. శామ్సంగ్ ఇండియా కొత్త ఇన్నోవేషన్లపై దృష్టి సారించిందని అందుకనే కొత్త ట్యాలెంట్‌ని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. భారత టాప్ విద్యా సంస్థల నుంచి ప్రతిభావంతుల్ని తీసుకుంటామని చెప్పారు. వీరు కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలు, ప్రొడక్ట్స్, డిజైన్స్‌పై దృష్టి సారిస్తారని అన్నారు. ఇండియా సెంట్రిక్ ఇన్నోవేషన్స్ వీరి నుంచి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా శామ్సంగ్ ఇండియా ఇక్కడ ఇప్పటి వరకు దాదాపుగా 7,500కు పైగా పేటెంట్లకు అప్లై చేసింది. మల్టీ కెమెరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, ఐదో జనరేషన్ మొబైల్ సిస్టమ్‌లు (5G), 6Gలపైనా వీరు అప్లై చేసిన పేటెంట్లు ఉండటం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Private Jobs, Samsung