ఆర్థిక మాంద్యం హెచ్చరికలతో గ్లోబల్ కంపెనీలు ఖర్చుల నియంత్రణ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగులను (Jobs) తొలగించడం, జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బాటలో గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), ఫేస్‌బుక్ (Facebook), ట్విట్టర్ (Twitter), అమెజాన్ (Amazon) వంటి దిగ్గజ కంపెనీలు నడిచాయి. తాజాగా అమెరికాకు చెందిన మరో కంపెనీ ఈ జాబితాలో చేరింది.
ఖర్చులు తగ్గించుకోవడమే లక్ష్యం
శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్(Salesforce) కార్పొరేషన్స్ సాఫ్ట్‌వేర్, ఖర్చులను తగ్గించుకోవడం కోసం తాజాగా 7,350 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఇది మొత్తం వర్క్ ఫోర్స్‌లో పది శాతంగా ఉండనుంది. కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 73,500పైగా ఉంది. అంతేకాకుండా కంపెనీ కొన్ని ఆఫీస్‌లను సైతం మూసివేయనున్నట్లు సమాచారం.
పరిమితంగా కస్టమర్ల కొనుగోలు శక్తి
ఈ విషయంపై ఉద్యోగులకు కంపెనీ సీఈవో మార్క్ బెనియోఫ్ లేఖలు పంపారు. అందులో.. ‘పరిస్థితులు సవాలుగా మారాయి. కస్టమర్స్ కొనుగోలు నిర్ణయాల్లో చాలా పరిమితంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, వర్క్‌ఫోర్స్ తగ్గించాలనే చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాం. రాబోయే వారాల్లో దాదాపు 10 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నాం.’ అని పేర్కొన్నారు.
తొలగింపు ఖర్చులు
కంపెనీ తన ప్లాన్‌కు సంబంధించి 1.4 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ల డాలర్ల వరకు ఛార్జీల రూపంలో వస్తాయని అంచనా వేసింది. ఇందులో 1 బిలియన్ డాలర్లు- 1.4 బిలియన్ల డాలర్ల వరకు ఉద్యోగుల బదిలీ, విభజన చెల్లింపులు, ఉద్యోగుల ప్రయోజనాలు, స్టాక్ ఆధారిత పరిహారంతో ముడిపడి ఉంటాయి. ఆఫీసు మూసివేత కోసం 450 మిలియన్ల డాలర్ల నుంచి 650 మిలియన్ల డాలర్ల వరకు ఛార్జీలు ఉంటాయి. నాలుగో ఆర్థిక త్రైమాసికంలో సుమారు 800 మిలియన్ నుంచి 1 బిలియన్ల డాలర్ల వరకు ఛార్జీలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
2018-21 మధ్య రెండింతలు
బిజినెస్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను కొనసాగించడానికి మహమ్మారి సమయంలో టెక్ కంపెనీలు దూకుడుగా నియామకాలు చేపట్టాయి. ఈ క్రమంలో సేల్స్‌ఫోర్స్ 2018 నుంచి వేగంగా వృద్ధి చెందుతోంది. అప్పటి నుంచి 2021 మధ్య కంపెనీ వర్క్‌ఫోర్స్ దాదాపు రెండింతలకు పైగా పెరిగింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆర్థికమాంద్యం ముంచుకొస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కంపెనీలు ఉన్నపలంగా ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఉద్యోగుల రీస్ట్రక్చర్ ఎఫర్ట్స్ చాలా వరకు పూర్తవుతాయని సేల్స్‌ఫోర్స్ భావిస్తోంది. ఆఫీస్‌ల మూసివేతలకు సంబంధించిన చర్యలు 2026 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తోంది.
లేఆఫ్స్ ప్రయోజనాలు
సహ వ్యవస్థాపకులుగా బెనియోఫ్, బ్రెడ్ టేలర్ 1999లో సేల్స్‌ఫోర్స్ స్థాపించారు. అయితే గత నవంబర్‌లో బ్రెట్ టేలర్ కో-CEO, వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బెనియోఫ్ ఇటీవల ఏకైక CEO అయ్యాడు. తొలగిస్తున్న ఉద్యోగులకు దాదాపు ఐదు నెలల వేతనం, ఆరోగ్య బీమా, కెరీర్ సోర్స్ వంటి ఇతర ప్రయోజనాలు లభిస్తాయని బెనియోఫ్ వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT jobs, JOBS, Private Jobs