Home /News /jobs /

REPORT ON 3 MILLION JOBS LOSSES INCORRECT IT SECTOR HIRED 1 38 LAKH IN FY21 SAYS NASSCOM SU GH

Indian IT Sector: 30 లక్షల ఉద్యోగాల కోత అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన నాస్‌కామ్.. కొత్తగా ఎన్ని నియామకాలు జరిగాయంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నైపుణ్యాలు ఉన్న ఐటీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని NASSCOM తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ రంగంలో 3 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది.

భారత్‌లో సుమారు 30 లక్షల ఐటీ-బీపీఎం ఉద్యోగులను సంస్థలు తొలగించనున్నాయనే నివేదికను ఐటీ పరిశ్రమల సంఘం నాస్కామ్ ఖండించింది. నైపుణ్యాలు ఉన్న ఐటీ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. వచ్చే ఏడాదిలో ఈ రంగంలో 3 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ సంస్థ వెల్లడించిన నివేదిక ఇటీవల తెలిపింది. రోబోటిక్ ప్రాసెస్, ఆటోమేషన్ అభివృద్ధి కారణంగా భారత ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలు తక్కువ నైపుణ్యాలు ఉన్న ఉద్యోగాల్లో 30 శాతం మందిని తొలగించే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. ఈ నివేదికను నాస్కామ్ తోసిపుచ్చింది.

పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పరిధి, ఆటోమేషన్‌తో కొత్త ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని నాస్కామ్ తెలిపింది. ఐటీ రంగంలో నియామకాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 138,000 నియామకాలు జరిగినట్లు వెల్లడించింది. ఈ రంగంలో 2.5 లక్షల మంది ఉద్యోగుల డిజిటల్ నైపుణ్యాల వృద్ధికి బాటలు వేశామని, 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్నామని ఏజెన్సీ తెలిపింది. 2025 నాటికి 300-350 బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఐటీ రంగం అవతరిస్తుందని నాస్కామ్ ప్రకటించింది. ఐటీ-బీపీఎం రంగం ప్రస్తుత రెవెన్యూ 194 బిలియన్ డాలర్లుగా ఉంది.

* మహమ్మారి సమయంలోనూ లాభాలు
గత మూడు సంవత్సరాలుగా ఆటోమేషన్, రోబోటిక్ ప్రాసెస్ విభాగం వృద్ధి చెందుతోందని, ఫలితంగా బీపీఎం రంగంలో కొత్త ఉద్యోగాల సృష్టికి అవకాశం ఏర్పడుతోందని నాస్కామ్ తెలిపింది. మహమ్మారి కారణంగా లాభపడ్డ రంగాల్లో భారత ఐటీ పరిశ్రమ ఒకటి. కరోనా సమయంలో ఐటీ సంస్థలు మంచి విజయాలు సాధించాయి. 2021 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో టీసీఎస్ రికార్డు స్థాయిలో 9.2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలోని అన్ని త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది 14 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలతో రికార్డు సాధించింది. గత ఏడాది నాలుగో త్రైమాసికంలో విప్రో కూడా 1.4 బిలియన్ డాలర్ల విలువైన 12 పెద్ద కాంట్రాక్టులు దక్కించుకుంది.

కొత్త ఒప్పందాల నేపథ్యంలో, కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిభ ఉన్న ఉద్యోగులను ఆకర్షించడానికి, ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవటానికి కంపెనీలు ఎక్కువ మొత్తంలో జీతాలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. మహమ్మారి తరువాత కంపెనీలు కార్యకలాపాలను డిజిటలైజ్ చేయడంతో సాఫ్ట్‌వేర్ సేవలకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా కొత్త ఉద్యోగ నియామకాలకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞులైన నిపుణులతో పాటు, వచ్చే ఏడాది ప్రముఖ ఐటీ సంస్థలు లక్ష మంది ఫ్రెషర్లను నియమించే అవకాశం ఉందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
Published by:Sumanth Kanukula
First published:

Tags: IT Employees, JOBS

తదుపరి వార్తలు